Mandatory Pension: ఏం సంపాదించినా వేస్టేనా? నెలకు 15 వేలు దాటితే పెన్షన్ ఉండదా?

Mandatory Pension: ఏం సంపాదించినా వేస్టేనా? నెలకు 15 వేలు దాటితే పెన్షన్ ఉండదా?
X

Mandatory Pension: దేశంలో పనిచేస్తున్న ఉద్యోగులకు ముఖ్యంగా ప్రైవేట్ రంగంలో ఉన్నవారికి సామాజిక భద్రత కల్పించే విషయంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకునేందుకు కసరత్తు చేస్తోంది. ఉద్యోగులకు తప్పనిసరి పెన్షన్ వర్తించడానికి ప్రస్తుతం నెలకు రూ.15,000 జీతం అనే పరిమితి ఉంది. ఇప్పుడు ఈ పరిమితిని మార్చడంపై పునరాలోచించాల్సిన అవసరం ఉందని ఆర్థిక సేవల విభాగం కార్యదర్శి ఎం.నాగరాజు స్పష్టం చేశారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం, నెలకు రూ.15,000 కంటే తక్కువ సంపాదించే ఉద్యోగులకు మాత్రమే ఈపీఎఫ్ వ్యవస్థలో నమోదు తప్పనిసరిగా ఉంది. అయితే, రూ.15,000 కంటే ఎక్కువ సంపాదించే వారికి ఇది తప్పనిసరి కాదు.

"ప్రైవేట్ రంగంలో పనిచేస్తూ రూ.15,000 కంటే ఎక్కువ సంపాదించే వ్యక్తులు పెన్షన్ కవర్ లేకుండా ఉండటం చాలా బాధాకరం. వృద్ధాప్యంలో వారు పిల్లలపై ఆధారపడకుండా, సురక్షితమైన భవిష్యత్తును ఎలా పొందగలరు అనే దానిపై దృష్టి పెట్టాలి. ఎక్కువ సంపాదించే వారి భవిష్యత్తును కూడా సురక్షితం చేయాలి" అని ఆయన అన్నారు. గరిష్ట సంఖ్యలో ప్రజలను పెన్షన్ పథకాల పరిధిలోకి తీసుకురావాలన్న ప్రభుత్వ లక్ష్యానికి ఈ పరిమితి విరుద్ధంగా ఉందని సీఐఐ ఆర్థిక సదస్సులో ఆయన పేర్కొన్నారు.

సామాజిక భద్రత అందించే దిశగా ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలితంగా అటల్ పెన్షన్ యోజన లబ్ధిదారుల సంఖ్య భారీగా పెరిగింది. అటల్ పెన్షన్ యోజన కింద లబ్ధిదారుల సంఖ్య 8.3 కోట్ల మార్కును దాటింది. వీరిలో 48 శాతం మంది మహిళలు ఉన్నారు. అసంఘటిత రంగంలో ఉన్న ప్రజలతో సహా మరింత ఎక్కువ మందిని సామాజిక భద్రతా చర్యల పరిధిలోకి తీసుకురావడానికి ప్రభుత్వ ప్రయత్నాలు భవిష్యత్తులో కూడా కొనసాగుతాయని నాగరాజు తెలిపారు.

ఇదే కార్యక్రమంలో పాల్గొన్న బీమా నియంత్రణ సంస్థ ఐఆర్‌డీఏఐ సభ్యుడు (జీవిత బీమా) స్వామినాథన్ ఎస్ అయ్యర్ కూడా పెన్షన్, భవిష్యత్తు ఆర్థిక భద్రత గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. పెరుగుతున్న వినియోగదారుల డిమాండ్ నేపథ్యంలో, ఇప్పుడున్న యువతరం 30 సంవత్సరాల తర్వాత పదవీ విరమణ చేసే నాటికి వారి వద్ద తగినంత డబ్బు ఉండేలా చూసుకోవడం ఒక పెద్ద సవాల్ అని ఆయన అన్నారు.

మూడింట రెండు వంతుల మంది భారతీయులకు జీవిత బీమా లేదని అయ్యర్ ఆవేదన వ్యక్తం చేశారు. బీమా రంగంలో ప్రైవేట్ సంస్థలకు అవకాశం కల్పించినా, ఇప్పటికీ 85 శాతం వ్యాపారం పట్టణ ప్రాంతాల నుంచే వస్తుండగా, మారుమూల ప్రాంతాల్లో కవరేజ్ సరిగా లేదని ఆయన తెలిపారు.

Tags

Next Story