LinkedIn : లింక్డ్‌ఇన్‌లో సరికొత్త ఫీచర్లు.. రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించడం ఎలా?

LinkedIn : లింక్డ్‌ఇన్‌లో సరికొత్త ఫీచర్లు.. రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించడం ఎలా?
X

LinkedIn : ఉద్యోగాన్వేషణలో ఉన్న ప్రొఫెషనల్స్‌కు లింక్డ్‌ఇన్ ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఓపెన్ టు వర్క్ ఫీచర్ ద్వారా తాము కొత్త అవకాశాల కోసం చూస్తున్నామని ఇతరులకు తెలియజేసే అవకాశం ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఈ ఫీచర్‌ను ఉపయోగించిన వారిలో 85% మందికి తమ కనెక్షన్ల నుంచి సహాయం లేదా ప్రోత్సాహం లభించినట్లు లింక్డ్‌ఇన్ తెలిపింది. ఈ విజయాన్ని దృష్టిలో ఉంచుకుని, లింక్డ్‌ఇన్ తమ సభ్యులకు ఉద్యోగ వేటలో మరింత పారదర్శకతను అందించడానికి కొన్ని ముఖ్యమైన అప్‌డేట్‌లను తీసుకొచ్చింది. ఈ కొత్త ఫీచర్లను ఉపయోగించి, రిక్రూటర్ల దృష్టిని ఎలా ఆకర్షించాలో తెలుసుకుందాం.

నోటీస్ పీరియడ్, జీతం అంచనా ఓపెన్ టు వర్క్ ఫీచర్‌ను ఆన్ చేసేటప్పుడు, సభ్యులు ఇప్పుడు తాము ఎంత త్వరగా ఉద్యోగంలో చేరగలరో తెలియజేయడానికి తమ ప్రస్తుత కంపెనీలో ఉన్న నోటీస్ పీరియడ్‌ను నమోదు చేయవచ్చు. అంతేకాకుండా, కొత్త ఉద్యోగం కోసం తాము ఎంత జీతం ఆశిస్తున్నారో కూడా నమోదు చేసే అవకాశం కల్పించారు.

ఈ ఆప్షన్స్ ప్రొఫెషనల్స్‌కు ప్రారంభంలోనే స్పష్టత ఇవ్వడానికి సహాయపడతాయి. తమ అంచనాలకు తగినవి కాని ఉద్యోగావకాశాల కోసం అనవసరమైన చర్చలు లేదా ఇంటర్వ్యూలలో పాల్గొని సమయాన్ని వృథా చేసుకోకుండా ఈ ఫీచర్లు కాపాడతాయి. ఈ వివరాలు నోటీస్ పీరియడ్, సాలరీ అంచనా రిక్రూటర్లకు మాత్రమే కనిపిస్తాయి, కానీ మీ ఓపెన్ టు వర్క్ బ్యాడ్జ్ మాత్రం అందరికీ కనిపిస్తుంది.

రిక్రూటర్లకు సిగ్నల్స్ లింక్డ్‌ఇన్ ఇండియాలోని టాలెంట్ అండ్ లెర్నింగ్ సొల్యూషన్స్ హెడ్ రుచీ ఆనంద్ ప్రకారం.. ఉద్యోగార్ధుల ఓపెన్ టు వర్క్ స్టేటస్‌ను రిక్రూటర్లు మూడు రకాలుగా – ట్రాఫిక్ లైట్ల మాదిరిగా ఎరుపు, పసుపు, ఆకుపచ్చ సంకేతాలుగా – విభజించి చూస్తారు.

1. రెడ్ ఫ్లాగ్

ఉద్యోగార్థుల లింక్డ్‌ఇన్ ప్రొఫైల్ రిక్రూటర్లలో సందేహాలు కలిగించవచ్చు. ఉద్యోగాల మధ్య అసాధారణ గ్యాప్స్ ఉండటం, సరైన కారణం లేకుండా ఉద్యోగం మానేయడం లేదా అనేక ఆఫర్‌లను పెట్టుకుని గోస్టింగ్ చేయడం వంటివి రిక్రూటర్లకు తప్పుడు సంకేతాలను పంపుతాయి. ఒకవేళ ఉద్యోగం కోల్పోవడం, కెరీర్ మార్పు లేదా బ్రేక్ తీసుకున్నట్లయితే, ఆ వివరాలను మీ ప్రొఫైల్‌లో తప్పక చేర్చాలి. దీనివల్ల మీ సమాచారం నమ్మకమైనదిగా మారి, మీపై విశ్వాసం పెరుగుతుంది.

2. యెల్లో ఫ్లాగ్

పనిలో చేరే సమయం, ఆశించే జీతం వివరాలు ఇవ్వడంతో పాటు, మీకు ఉన్న వివిధ నైపుణ్యాల గురించి కూడా స్పష్టంగా తెలియజేయాలి. ప్రపంచవ్యాప్తంగా దాదాపు 42% రిక్రూటర్లు ప్రతి వారం లింక్డ్‌ఇన్‌లో స్కిల్స్ ఫిల్టర్ ఉపయోగించి అభ్యర్థులను వెతుకుతున్నారు. కొంతమంది అర్హతలు ఉన్నా, స్కిల్స్ విభాగాన్ని ఖాళీగా ఉంచడం వల్ల మంచి అవకాశాలు కోల్పోతున్నారు. కనీసం ఐదు లేదా అంతకంటే ఎక్కువ స్కిల్స్ ను ప్రొఫైల్‌లో నమోదు చేస్తే, రిక్రూటర్లు మీ ప్రొఫైల్‌ను చూసే అవకాశం ఐదు లేదా ఆరు రెట్లు పెరుగుతుంది.

3. గ్రీన్ ఫ్లాగ్

మీ లక్ష్యం స్పష్టంగా ఉంటే, రిక్రూటర్లు మీ పట్ల ఉత్సాహం చూపుతారు. ఏ పదవులను కోరుకుంటున్నారో స్పష్టంగా తెలియజేసిన, ముఖ్యమైన వివరాలతో ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేసిన ఓపెన్ టు వర్క్ ఫీచర్‌ను ఆన్ చేసిన అభ్యర్థులకు రిక్రూటర్ల నుండి మెసేజ్‌లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి, ఈ ఫీచర్ ఆన్ చేయడం వల్ల రిక్రూటర్లు మీకు మెసేజ్ పంపే అవకాశం రెట్టింపు అవుతుంది.

ఓపెన్ టు వర్క్ బ్యాడ్జ్ ఆన్ చేసే విధానం రిక్రూటర్లకు సరైన సంకేతాలను పంపుతూ ఓపెన్ టు వర్క్ బ్యాడ్జ్‌ను ఆన్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో అవ్వండి.

స్టెప్ 1: మీ లింక్డ్‌ఇన్ ప్రొఫైల్‌కి వెళ్లి ఓపెన్ టు పై క్లిక్ చేసి, ఫైండింగ్ ఎ న్యూ జాబ్ సెలక్ట్ చేసుకోండి.

స్టెప్ 2: మీరు ఆసక్తి ఉన్న ఉద్యోగాల టైటిల్స్‌ను నమోదు చేసి, మీరు కోరుకుంటున్న జాబ్ టైప్ (ఉదా: ఫుల్-టైమ్, కాంట్రాక్ట్) తెలియజేయండి.

స్టెప్ 3: మీరు ఎంత త్వరగా ఉద్యోగంలో చేరడానికి సిద్ధంగా ఉన్నారో చూపించడానికి నోటీస్ పీరియడ్‌ను నమోదు చేయండి (ఇది రిక్రూటర్లకు మాత్రమే కనిపిస్తుంది).

స్టెప్ 4: మీ సాలరీ ప్రాధాన్యతను సూచించడానికి, మీరు ఆశించే యాన్యువల్ సాలరీ సరిగ్గా సూచించండి (ఇది కూడా రిక్రూటర్లకు మాత్రమే కనిపిస్తుంది).

స్టెప్ 5: మీ ఓపెన్ టు వర్క్ బ్యాడ్జ్ ఎవరికి కనిపించాలో మీరే నిర్ణయించుకోవచ్చు. రిక్రూటర్స్ ఓన్లీ అనే ఆప్షన్‌ను ఎంచుకుంటే, మీ ప్రస్తుత నెట్‌వర్క్‌కు తెలియకుండా కేవలం రిక్రూటర్ల దృష్టిని ఆకర్షించవచ్చు.

Tags

Next Story