New Income Tax Rules : ఉద్యోగులకు షాక్.. కంపెనీ కారు వాడుతున్నారా? అయితే భారీగా పన్ను కట్టాల్సిందే.

New Income Tax Rules : మీరు ఏదైనా కంపెనీలో ఉద్యోగం చేస్తూ, ఆఫీస్ ఇచ్చే కారును వాడుకుంటున్నారా? అయితే తస్మాత్ జాగ్రత్త. కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న కొత్త ఆదాయపు పన్ను నిబంధనలు మీ జేబుకు చిల్లు పెట్టబోతున్నాయి. కంపెనీ కార్లను వ్యక్తిగత అవసరాలకు కూడా వాడుకునే ఉద్యోగులపై పన్ను భారం భారీగా పెరగనుంది. పార్లమెంట్ గనుక ఈ ముసాయిదా నిబంధనలకు ఆమోదం తెలిపితే, మీరు చెల్లించే పన్ను గణనీయంగా పెరుగుతుంది. ముఖ్యంగా జీతగాళ్లకు ఈ పర్స్ రూపంలో వచ్చే అదనపు సౌకర్యాలపై ట్యాక్స్ లెక్కలు పూర్తిగా మారిపోనున్నాయి.
ఎవరిపై ఎంత భారం పడొచ్చు?
కొత్త నిబంధనల ప్రకారం.. వార్షికాదాయం రూ.25 లక్షలు ఉన్న ఉద్యోగి, కంపెనీ కారు వాడుతుంటే ఏడాదికి సుమారు రూ.8,387 అదనంగా పన్ను చెల్లించాల్సి ఉంటుంది. అదే విధంగా రూ.15 లక్షల జీతం ఉన్న వారికి సుమారు రూ.4,352 వరకు భారం పడే అవకాశం ఉంది. మీరు పాత ట్యాక్స్ విధానంలో ఉన్నా, కొత్త ట్యాక్స్ విధానంలో ఉన్నా.. ఈ సౌకర్యాల విలువను లెక్కించే విధానం మాత్రం ఒకేలా ఉంటుంది. కాబట్టి ఏ రిజీమ్ ఎంచుకున్నా ఈ అదనపు పన్ను నుంచి తప్పించుకోవడం కష్టం.
ట్యాక్స్ లెక్కలు ఎలా మారుతున్నాయి?
సాధారణంగా కంపెనీ కారు ఇచ్చి, దాని పెట్రోల్, మెయింటెనెన్స్ ఖర్చులు కూడా కంపెనీయే భరిస్తే.. దానిని మీ ఆదాయంలో భాగంగా పరిగణిస్తారు.
1.6 లీటర్ల లోపు ఇంజన్ సామర్థ్యం: ఇప్పటివరకు నెలకు రూ.1,800 గా ఉన్న పర్క్ విలువను, కొత్త ప్రతిపాదనల ప్రకారం రూ.5,000కు పెంచనున్నారు.
1.6 లీటర్ల పైన ఇంజన్ సామర్థ్యం: ప్రస్తుతం ఉన్న రూ.2,400 స్థానంలో ఇకపై రూ.7,000 గా పరిగణిస్తారు.
డ్రైవర్‌ను కూడా కంపెనీయే ఇస్తే, నెలకు అదనంగా మరో రూ.3,000 పర్క్ వాల్యూగా కలుస్తుంది (ప్రస్తుతం ఇది కేవలం రూ.900 మాత్రమే). అంటే డ్రైవర్‌తో కూడిన పెద్ద కారు వాడితే ఏడాదికి రూ.1.2 లక్షల ఆదాయం మీ జీతానికి అదనంగా కలిపినట్లు భావించి దానిపై స్లాబ్ రేటు ప్రకారం పన్ను వేస్తారు.
కంపెనీ కేవలం ఖర్చులు మాత్రమే భరిస్తే?
ఒకవేళ కారు మీదే అయ్యుండి, దాని ఖర్చులు (పెట్రోల్, మెయింటెనెన్స్) కంపెనీ ఇస్తుంటే.. అప్పుడు కూడా పన్ను బాదుడు తప్పదు. 1.6 లీటర్ల లోపు కారుకు నెలకు రూ.2,000, అంతకంటే పెద్ద కారుకు రూ.3,000 పర్క్ వాల్యూగా నిర్ణయించారు. పాత నిబంధనల్లో ఇవి కేవలం రూ.600, రూ. 900 గా ఉండేవి. అంటే దాదాపు మూడు రెట్లు పెరగబోతున్నాయి. ఉద్యోగులకు ఇచ్చే సౌకర్యాల ద్వారా వచ్చే అదృశ్య ఆదాయం పై పన్ను వసూలు చేయడమే ప్రభుత్వ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది.
నిపుణులు ఏమంటున్నారు?
ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్ 2026లోని రూల్ 15 ప్రకారం.. ఈ మార్పులు ప్రతిపాదించారు. కొత్త ట్యాక్స్ విధానం రేట్లు తక్కువగా ఉన్నప్పటికీ, ఇలాంటి సౌకర్యాల విలువ పెంచడం వల్ల నికరంగా కట్టే పన్ను పెరుగుతుందని ట్యాక్స్ నిపుణులు చెబుతున్నారు. ఇది కేవలం కార్లకే పరిమితం కాకుండా, ఇతర కంపెనీ సౌకర్యాలపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. కాబట్టి కంపెనీ నుంచి కారు తీసుకునే ముందు ఈ పన్ను లెక్కలు సరిచూసుకోవడం మంచిది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
