Infosys : ఏఐతో ఉద్యోగాలకు ముప్పు లేదు : ఇన్ఫోసిస్

తమ క్లయింట్లలో చాలా వరకు జనరేటివ్ ఏఐ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్)పై ఆసక్తి కనిపిస్తోందని సాఫ్ట్ వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ వెల్లడించింది. కొత్తతరం టెక్నాలజీ వల్ల తమ కంపెనీలో ఉద్యోగాలు పోతాయని అనుకోవడం లేదని ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్ తెలిపారు.ఒకప్పుడు డిజిటల్, క్లౌడ్ టెక్నాలజీలకు లభించిన తరహాలోనే ఇప్పుడు జనరేటివ్ ఏఐకి ఆదరణ కనిపిస్తోందని పరేఖ్ వివరించారు. ఈ కొత్త టెక్నాలజీ నుంచి కంపెనీలు, వ్యాపారాలు ప్రయోజనాలను పొందే కొద్దీ వాటి అమలు వేగవంతమవుతుందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా టెక్ కంపెనీల తరహాలోనే ఇన్ఫోసిస్ సైతం తమ ఏఐ సామర్థ్యాలను బలోపేతం చేసుకుంటోందని తెలిపారు. తమ క్లయింట్ల కోసం దాదాపు 225 జనరేటివ్ ఏఐ ప్రోగ్రామ్‌లపై పనిచేస్తున్నట్లు ఇన్ఫోసిస్ ఇటీవల వెల్లడించింది.ఈ కొత్త టెక్నాలజీపై దాదాపు 2.50 లక్షల మంది ఉద్యోగులకు శిక్షణనిచ్చినట్లు తెలిపింది.జనరేటివ్ ఏఐ వల్ల ఇన్ఫోసిస్‌లో ఎలాంటి ఉద్యోగకోతలు ఉంటాయని అనుకోవడం లేదని పరేఖ్ స్పష్టం చేశారు. ఈ టెక్నాలజీ వల్ల కొత్త రంగాలు పుట్టుకొస్తున్నాయని.. తద్వారా కొత్త అవకాశాలూ వస్తాయని తెలిపారు. ఆర్థిక పరిస్థితులు మెరుగవుతున్న కొద్దీ మరిన్ని నియామకాలూ చేపడతామన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com