TG : పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రాసెస్ స్టార్ట్
తెలంగాణలో మెడికల్ పీజీ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. ఈ మేరకు కాళోజీ నారాయణరావు ఆరోగ్య విశ్వవిద్యాలయం బుధవారం నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. 2024-25 సంవత్సరానికి కన్వీనర్ కోటా కింద ఎండీ, ఎంఎస్, డిప్లొమా మెడికల్ కోర్సుల్లోని సీట్లను భర్తీ చేయనున్నారు. కాళోజీ వర్సిటీతో పాటు నిమ్స్‌కు అనుబంధంగా ఉన్న మెడికల్ కాలేజీల్లో సీట్లనూ భర్తీ చేయనున్నారు. నీట్ పీజీ-2024 అర్హత కలిగిన అభ్యర్థులు గురువారం ఉదయం 6 గంటల నుంచి వచ్చే నెల 7వ తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. https://tspgmed.tsche.in వెబ్‌సైట్‌లో స్కాన్ చేసిన సర్టిఫికేట్లను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఇక కన్వీనర్ కోటాలో అడ్మిషన్ల కోసం స్టేట్ మెరిట్ స్థానాన్ని నిర్ణయిస్తారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ సమయంలో అప్‌లోడ్ చేసిన అన్ని సర్టిఫికెట్ల పరిశీలన తర్వాత తాత్కాలిక తుది మెరిట్ జాబితా ప్రదర్శిస్తారు. ఇక పీజీ మెడికల్ కోర్సుల కోసం నీట్ పీజీ-2024 పరీక్షలో కట్-ఆఫ్ స్కోర్‌ను వెల్లడించారు. ఓపెన్ కేటగిరీకి 50 పర్సంటైల్, ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 40 పర్సంటైల్, ఓసీల్లో వైకల్యం ఉన్నవారికి 45 పర్సంటైల్‌ను ఖరారు చేశారు. ఇక ఎండీ ఆయుర్వేద, హోమియో, యునాని కోర్సుల్లో ప్రవేశాలకు కూడా నోటిఫికేషన్లు జారీచేశారు. బుధవారం సాయంత్రం 4 గంటల నుంచే వాటికి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. వచ్చే నెల ఐదో తేదీ సాయంత్రం ఆరు గంటల వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐఏపీజీఈటీ-2024 పరీక్షలో అర్హత సాధించినవారు ఈ మూడు కోర్సుల్లో చేరేందుకు అర్హులు.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com