ఆఫీస్ కు రావాల్సిందే.. ఉద్యోగులకు టీసీఎస్ ఫైనల్ వార్నింగ్

ప్రముఖ ఐటీ దిగ్గజం టీసీఎస్ (TCS) తన ఉద్యోగులకు మరోసారి కీలక హెచ్చరిక జారీ చేసింది. ఉద్యోగులు ఆఫీస్ నుంచి పనిచేయాలని ఫైనల్ అలర్ట్ ను ప్రకటించింది. మరో త్రైమాసంలోగా నూతన విధానాన్ని ఉద్యోగులు విధిగా అనుసరించాలని స్పష్టం చేసింది. రిమోట్ వర్కింగ్‌ను సుదీర్ఘంగా కొనసాగిస్తే ప్రతికూల పరిణామాలు ఎదురవుతాయని కూడా ఉద్యోగులను కంపెనీ హెచ్చరించింది.
మార్చి మాసం చివరిలోగా కార్యాలయాల నుంచి పనిచేయక తప్పదని టీసీఎస్ స్పష్టం చేసింది. ఉద్యోగులు ముఖాముఖి సంప్రదింపులతో కార్యాలయ వాతావరణంలో పనిచేస్తే మెరుగైన వ్యాపార ఫలితాలు చేకూరుతాయని టీసీఎస్ ఇప్పటికే పలుమార్లు స్పష్టం చేసింది. దశలవారీగా రిమోట్ వర్క్‌కు స్వస్తిపలికి మహమ్మారి ముందు రోజుల తరహాలో సాధారణ వర్క్ పాలసీ అమలయ్యేలా టీసీఎస్ చర్యలు చేపడుతోంది.
కరోనా మహమ్మారి కారణంగా నెమ్మదించిన పలు గ్లోబల్ కంపెనీలు ప్రస్తుతం హైబ్రిడ్ వర్క్ విధానాన్ని కొనసాగిస్తున్న సంగతి తెలిసిందే. నిర్ధేశిత గడువులోగా ఉద్యోగులు విధిగా కార్యాలయాల నుంచి పనిచేయాలని, విరుద్ధంగా వ్యవహరించిన ఉద్యోగులు తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారని టీసీఎస్ సీవోవో ఎన్‌జీ సుబ్రహ్మణ్యం తేల్చిచెప్పడంతో వర్క్ ఫ్రం ఆఫీస్ పట్ల కంపెనీ ఎంత కటువుగా ఉందో అర్థమవుతోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com