Tata Group : రాబోయే ఐదేళ్లలో 5 లక్షల ఉద్యోగాలు -టాటా గ్రూప్

రాబోయే ఐదేళ్లలో తయారీ రంగంలో టాటా గ్రూపు 5 లక్షల ఉద్యోగాలు సృష్టించబోతోందని ఆ గ్రూప్ ఛైర్మన్ ఎన్.చంద్రశేఖరన్ తెలిపారు. సెమీ కండక్టర్, ఎలక్ట్రిక్ వెహికల్, బ్యాటరీ, సంబంధిత రంగాల్లో ఈ ఉద్యోగాలు రానున్నాయని చెప్పారు. ఇండియన్ ఫౌండేషన్ ఫర్ క్వాలిటీ మేనేజ్‌మెంట్ సింపోజియంలో ఈమేరకు మంగళవారం ఆయన మాట్లాడారు. తయారీరంగంలో పెద్దఎత్తున ఉద్యోగ సృష్టి జరగకుండా అభివృద్ధి చెందిన దేశంగా మారడం అంత సులువు కాదని చెప్పారు. సెమీ కండక్టర్, ప్రెసిషన్ మానుఫాక్చరింగ్, అసెంబ్లీ, ఎలక్ట్రిక్ వెహికల్, బ్యాటరీలు, సంబంధిత రంగాల్లో టాటా గ్రూపు పెట్టుబడులు రాబోయే ఐదేళ్లలో ఐదు లక్షల ఉద్యోగాలు సృష్టించబోతోందని చంద్రశేఖరన్ అన్నారు. అస్సాంలోని సెమీ కండక్టర్ ప్లాంట్, ఎలక్ట్రిక్ వాహనాలు, బ్యాటరీలకు సంబంధించి పలు ప్లాంట్లను ఏర్పాటుచేస్తున్నట్లు ఈసందర్భంగా ప్రస్తావించారు. ఈ ప్లాంట్ల వల్ల పర్యావరణ వ్యవస్థలో మరిన్ని చిన్నచిన్న పరిశ్రమలు సైతం ఏర్పాటుకానున్నాయని చెప్పారు. తయారీ రంగంలో ఈ స్థాయిలో ఉద్యోగాల కల్పన జరగాలంటే ప్రభుత్వ సహకారం కూడా అవసరమని పేర్కొన్నారు. సెమీ కండక్టర్ వంటి తయారీ రంగాల్లో వచ్చే ప్రతీ ఉద్యోగానికి పరోక్షంగా 8-10 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయని చంద్రశేఖరన్ అన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com