సెప్టెంబర్ నాటికి కరోనా..

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ నాటికి కరోనా పూర్తిగా అదుపులోకి వస్తుందని వైద్య ఆరోగ్య శాఖ ఉన్నతాధికారులు వివరించారు. కొవిడ్ టెస్టులు విస్తృతంగా నిర్వహించడం, త్వరితగతిన చికిత్స అందించడంతో మరణాల రేటు తక్కువగా ఉందని చెప్పారు. వర్షాకాలం సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉన్నందున ఆరోగ్యంపై అశ్రద్ధ వహించరాదన్నారు. మంగళవారం కోఠిలోని డీపీహెచ్ కార్యాలయంలో ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు, వైద్యారోగ్య సంచాలకుడు రమేశ్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. మలేరియా, డెంగ్యూ, చికెన్ గున్యా వంటి సీజనల్ వ్యాధుల లక్షణాలు, కరోనా ప్రాథమిక లక్షణాలు ఒకేవిధంగా ఉంటాయని, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యులు తీసుకోవాలని తెలిపారు. జ్వరం, దగ్గు, జలుబు వంటి లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా ప్రభుత్వాసుపత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలని తెలిపారు. కరోనా ప్రభావంతో ప్రజలకు ఆరోగ్యవంతమైన జీవితం అలవాటైందని, ఇది మంచి పరిణామమని అన్నారు. కాగా, రీ ఇన్ఫెక్షన్ కేసులు రాష్ట్రంలో నమోదైనట్లు తమ దృష్టికి వచ్చిందని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు అన్నారు. అయితే దీనిపై మరింత పరిశోధన జరగాల్సిన అవసరం ఉందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com