Rajya Sabha By-Elections : రాజ్యసభ ఉప ఎన్నికల్లో 12 స్థానాలు ఏకగ్రీవం

రాజ్యసభ ఉప ఎన్నికల్లో 12 స్థానాలూ ఏకగ్రీవమయ్యాయి. 9 రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న 12 రాజ్యసభ స్థానాల్లో ఉప ఎన్నికల నిర్వహణకు ఇటీవల ఈసీ నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 21వరకు నామినేషన్లు స్వీకరించగా.. తొమ్మిది స్థానాల్లో బీజేపీ, రెండు స్థానాల్లో ఆ పార్టీ మిత్రపక్షాలైన ఎన్సీపీ, ఆర్‌ఎల్‌ఎం అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరోవైపు, తెలంగాణ నుంచి కాంగ్రెస్ సీనియర్ నేత అభిషేక్ సింఘ్వీ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తాజా పరిణామంతో రాజ్యసభలో ఎన్డీయే మెజార్టీ మార్కును అందుకుంది. తాజా ఎన్నికతో రాజ్యసభలో బీజేపీ బలం 96కి చేరగా.. మిత్రపక్షాలతో కలిపి ఎన్డీఏ ఆ బలం 112గా ఉంది. దీనికితోడు అధికార పార్టీకి ఆరుగురు నామినేటెడ్, ఒక స్వతంత్ర సభ్యుడి మద్దతు కూడా ఉంది. తాజాగా కాంగ్రెస్ నుంచి ఒక సభ్యుడు గెలుపొందడంతో రాజ్యసభలో ప్రతిపక్షాల బలం 85కి పెరిగింది. రాజ్యసభలో ప్రస్తుతం మరో 8 స్థానాలు ఖాళీగా ఉన్నాయి. జమ్మూకశ్మీర్‌లో నాలుగు, మరో నాలుగు నామినేటెడ్ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దీంతో రాజ్యసభలో ప్రస్తుతం సభ్యుల సంఖ్య 237గా ఉండగా.. ఇందుకు మెజార్టీ మార్కు 119గా ఉంది. ప్రస్తుత సభ్యుల సంఖ్యను బట్టి చూస్తే ఎన్డీఏకు సభలో మెజార్టీ ఉంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com