Nagpur Factory Blast: నాగ్‌పూర్ పేలుడు పదార్థాల ఫ్యాక్టరీలో ఘోర ప్రమాదం.. 15 మంది మృతి

మహారాష్ట్రలో ఘోర ప్రమాదం సంభవించింది. నాగ్‌పూర్ జిల్లాలోని ఓ పేలుడు పదార్థాల తయారీ ఫ్యాక్టరీలో ఆదివారం ఉదయం భారీ పేలుడు సంభవించింది. ఈ దుర్ఘటనలో కనీసం 15 మంది మృతి చెందారని, పలువురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కటోల్ తహసీల్ పరిధిలోని రౌల్‌గావ్ గ్రామంలో ఉన్న ఎస్‌బీఎల్ ఎనర్జీ లిమిటెడ్ ఫ్యాక్టరీలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మైనింగ్, పారిశ్రామిక అవసరాల కోసం ఈ కంపెనీ పేలుడు పదార్థాలను తయారు చేస్తుంది. ఉదయం 7 గంటల నుంచి 7:15 గంటల మధ్య ఫ్యాక్టరీలోని డిటోనేటర్ ప్యాకింగ్ యూనిట్‌లో ఈ పేలుడు జరిగినట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు.
ప్రమాద సమాచారం అందిన వెంటనే పోలీసులు, సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకున్నాయి. పేలుడులో గాయపడిన వారిని వెంటనే నాగ్‌పూర్‌లోని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయని, పూర్తి వివరాలతో త్వరలో ఒక ప్రకటన విడుదల చేస్తామని కంపెనీ అధికారి ఒకరు తెలిపారు.
ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుల సంఖ్యపై భిన్నమైన నివేదికలు వస్తుండటంతో పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
