Manipur : మణిపుర్‌కు 'ఇండియా' ఎంపీలు

Manipur : మణిపుర్‌కు  ఇండియా ఎంపీలు
రెండు రోజులపాటు పర్యటించనున్న విపక్ష నేతలు

జాతుల మధ్య ఘర్షణతో అట్టుడుకుతున్న మణిపుర్‌లో విపక్ష కూటమి 'ఇండియా' ఎంపీలు పర్యటిస్తున్నారు. 21 మంది ఎంపీల బృందం మణిపుర్‌ రాజధాని ఇంపాల్‌ చేరుకున్నారు. రెండ్రోజుల పాటు అక్కడ నెలకొన్న పరిస్థితులను ఈ బృందం పరిశీలించనుంది.ఎంపీలు అక్కడి పరిస్థితిని క్షేత్రస్థాయిలో తెలుసుకోనున్నారు. ఎంపీల బృందం మణిపుర్‌లో సమస్యల పరిష్కారానికి, శాంతి స్థాపనకు, కేంద్రానికి, పార్లమెంటుకు సిఫార్సులు చేయనుందని కాంగ్రెస్ నేతలు తెలిపారు. వివిధ సామాజిక వర్గాలకు చెందిన ప్రజలు, నాయకులతో భేటీ కానున్నది. అలాగే పునరావాస కేంద్రాలను సందర్శించి అక్కడి వాస్తవ పరిస్థితులను బృందం తెలుసుకుంటారు. 16 పార్టీల ఎంపీలు మణిపుర్ లోయ, కొండల్లోని ప్రభావిత ప్రాంతాలను సందర్శిస్తారని నేతలు తెలిపారు.

గతంలో కూడా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు మణిపుర్‌ను సందర్శించాలని భావించినా ఉద్రిక్త పరిస్థితుల దృష్ట్యా వారికి అనుమతి లభించలేదు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మాత్రం... మణిపుర్‌లోని కొన్ని ప్రాంతాల్లో పర్యటించారు.


ఈ ప్రతినిధి బృందంలో కాంగ్రెస్‌ నుంచి ఆధిర్‌ రంజన్‌ ఛౌధురి, గౌరవ్‌ గొగోయ్, తృణమూల్ కాంగ్రెస్ నేత సుష్మితా దేవ్,డీఎంకే కనిమొళి, జేఎంఎంకు చెందిన మహువా మాజి, ఎన్‌సీపీ నేత మహ్మద్‌ ఫైజల్, ఆర్‌ఎస్‌పీ ఎన్‌కే ప్రేమచంద్రన్, ఆర్‌ఎల్‌డీ జయంత్‌ చౌధరి, ఆర్‌జేడీ మనోజ్‌ ఝా, వీసీకే నేత తిరుమావళన్‌.

వీరితో పాటు జేడీ(యు) చీఫ్‌ రాజీవ్‌ రంజన్‌ సింగ్, సీపీఐ నుంచి సందేశ్‌ కుమార్, సీపీఎం నేత ఏఏ రహీం, ఎస్‌పీ నుంచి జావెద్‌ అలీఖాన్, జేడీ–యూకు చెందిన అనీల్‌ ప్రసాద్‌ హెగ్డే, ఐయూఎంఎల్‌ ఈటీ మహ్మద్‌ బషీర్, ఆప్‌ నేత సుశీల్‌ గుప్తా, డీఎంకే నేత డి.రవి కుమార్, కాంగ్రెస్‌ నేతలు ఫులో దేవి నేతం, శివసేన(యూబిటీ) కి చెందిన అరవింద్ సావంత్, కె.సురేశ్‌ ఈ బృందంలో ఉన్నారు

నెలలు గడుస్తున్నా మణిపూర్‌లో హింసాత్మక ఘటనలు ఆగడంలేదు. గురువారం బిష్ణుపూర్‌ జిల్లాలోని మొయిరాంగ్‌లో రెండు ప్రత్యర్థి వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తుపాకులతో పరస్పరం కాల్పులకు తెగబడ్డారు. అనేక ఇళ్లను దహనం చేశారు. మరోవైపు ఇద్దరు కుకీ మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన కేసును సీబీఐ విచారించనుంది.

Tags

Read MoreRead Less
Next Story