Pakistani Citizens : దేశాన్ని వీడి వెళ్ళిన 537 మంది పాక్‌ పౌరులు

Pakistani Citizens : దేశాన్ని వీడి వెళ్ళిన 537 మంది పాక్‌ పౌరులు
X
ముగిసిన భారత ప్రభుత్వ డెడ్‌లైన్‌

పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో పాకిస్థాన్‌ పౌరులు దేశం విడిచి వెళ్లిపోవాలంటూ భారత్‌ విధించిన డెడ్‌లైన్‌ ఆదివారంతో (మెడికల్‌ వీసా వారికి 29 వరకు) ముగిసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు మూడు రోజుల వ్యవధిలో 537 మంది పాక్‌ పౌరులు, దౌత్యవేత్తలు అటారీ-వాఘా సరిహద్దు వెంబడి దేశాన్ని వదిలి పాక్‌కు తిరిగి వెళ్లిపోయారు. ఈ సందర్భంగా అమృత్‌సర్‌లోని ఈ అంతర్జాతీయ సరిహద్దు వద్ద ఆదివారం పెద్దయెత్తున వాహనాలు బారులుతీరాయి. చాలామంది భారతీయులు దేశం విడిచివెళ్తున్న తమ బంధువులకు వీడ్కోలు పలకడానికి అక్కడికి వచ్చారు. ఈ సందర్భంగా అక్కడ ఉద్విగ్న వాతావరణం ఏర్పడింది. 12 క్యాటగిరీల కింద స్వల్ప కాల వ్యవధి వీసాదారులు ఈ నెల 27లోగా దేశం వదిలి వెళ్లిపోవాలని భారత్‌ ఆదేశించింది. సార్క్‌ వీసా కలిగి ఉన్న వారికి ఏప్రిల్‌ 26, మెడికల్‌ వీసాలు ఉన్న వారికి ఏప్రిల్‌ 29 డెడ్‌లైన్‌గా విధించిన విషయం తెలిసిందే. అదేవిధంగా భారత్‌కు చెందిన 14 మంది దౌత్యవేత్తలు సహా 850 మంది ఈ అంతర్జాతీయ సరిహద్దు గుండానే భారత్‌కు చేరుకున్నారు.

మహరాష్ట్రలో పాకిస్థానీయులు మిస్సింగ్‌

దేశంలో ఉన్న పాక్‌ పౌరుల లెకలు తీస్తున్న వేళ మహారాష్ట్రలో కీలక పరిణామం చోటుచేసుకుంది. మహారాష్ట్రలో 107 మంది పాకిస్థానీయులు కనిపించకుండా పోవడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక డాటా ప్రకారం వివిధ రకాల వీసాలపై 5,050 మంది పాకిస్థానీలు ప్రస్తుతం రాష్ట్రంలో నివసిస్తున్నారు. వీరిలో 107 మంది జాడ తెలియడం లేదని, వీరి కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

ఒక వేళ, గడువులోగా భారత్ విడిచివెళ్లకుంటే సదుర పాక్ జాతీయుడిని అరెస్ట్ చేసి విచారించి, మూడు ఏళ్ల వరకు జైలు శిక్ష లేదా గరిష్టంగా రూ. 3 లక్షల జరిమానా లేదా రెండింటిని శిక్షగా విధించవచ్చు. ఏప్రిల్ 04న కొత్తగా అమలులోకి వచ్చి ఇమ్మిగ్రేషన్ అండ్ ఫారినర్స్ యాక్ట్-2025 ప్రకారం.. గడువు ముగిసిపోవడం, వీసా షరతుల్ని ఉల్లంఘించడం, నిషేధిత ప్రాంతాలను అతిక్రమించడం వంటివి చేస్తే ఈ శిక్షలు విధించవచ్చు.

Tags

Next Story