Jammu Kashmir : కశ్మీర్‌లో 58.85 శాతం పోలింగ్

Jammu Kashmir : కశ్మీర్‌లో 58.85 శాతం పోలింగ్
X

జమ్మూకశ్మీర్‌లో తొలి విడత ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. బుధవారం 24 నియోజకవర్గాల్లో ఫస్ట్ ఫేజ్- పోలింగ్ జరిగింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగింది. కశ్మీర్‌లోని నాలుగు జిల్లాలైన అనంత్‌నాగ్, పుల్వామా, షోపియాన్, కుల్గామ్‌లోని 16 స్థానాలు, జమ్ములోని మూడు జిల్లాలైన దోడా, రాంబన్, కిష్త్వార్‌లోని 8 స్థానాల్లో బుధవారం తొలి దశ కింద పోలింగ్‌ జరిగింది. తొలి దశలో 58.85 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు ఎన్నికల సంఘం(ఈసీ) వెల్లడించింది. కిష్త్వార్ జిల్లాలో అత్యధికం, పుల్వామాలో అత్యల్పంగా ఓటింగ్ నమోదైనట్లు తెలిపింది. సాయంత్రం 5 గంటల వరకు జిల్లాల వారీగా ఓటింగ్‌ శాతాన్ని ఈసీ పేర్కొంది. కిష్త్వార్‌లో 77.23 శాతం, దోడాలో 69.33 శాతం, రాంబన్‌లో 67.71 శాతం, కుల్గామ్‌లో 59.62 శాతం, అనంతనాగ్‌లో 54.17శాతం, షోపియాన్‌లో 53.64 శాతం, పుల్వామాలో 43.87 శాతం ఓటింగ్‌ నమోదైనట్లు వివరించింది. జమ్మూకశ్మీర్‌లో మూడు విడతల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగుతున్నాయి. బుధవారం తొలి విడత ఎన్నికలు జరగగా.. రెండో విడత సెప్టెంబర్ 25న, మూడో విడత పోలింగ్ అక్టోబర్ 1న జరగనున్నాయి. అక్టోబర్ 8న ఎన్నికల ఫలితాలు విడుదలకానున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ, నేషనల్‌ కాన్ఫరెన్స్‌ (ఎన్‌సీ), పీపుల్స్‌ డెమోక్రటిక్‌ పార్టీ (పీడీపీ) ప్రధానంగా పోటీ పడ్డాయి.

Tags

Next Story