Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం.. 8 మంది సజీవ దహనం..

Karnataka: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్‌కు చెందిన 8 మంది ప్రయాణికులు సజీవదహనం అయ్యారు. కలబురిగి జిల్లా కమలాపురలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.. ఆగి ఉన్న ట్రక్‌ను ఢీకొట్టి బోల్తా పడింది. దీంతో ఒక్కసారిగా బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో 8 మంది సజీవదహనం అయ్యారు. సహాయక చర్యలు చేపట్టిన పోలీసులు క్షతగాత్రులను కలబురిగిలోని 3 ఆస్పత్రులకు తరలించారు.
చికిత్స పొందుతున్న వారిలో పలువురి పరిస్థితి విషమంగా ఉంది. బస్సు గోవా నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. బస్సులో మొత్తం 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తోంది. 13 మందిని స్థానికులు కాపాడారు. ప్రమాదానికి గురైన బస్సు ఆరెంజ్ ట్రావెల్స్‌కు చెందిన బస్సుగా గుర్తించినట్లు కలబురిగి ఎస్పీ ఇషా పంత్ పేర్కొన్నారు. ఉదయం ఆరున్నర సమయంలో కమలాపుర వద్ద ప్రమాదం జరిగింది.
అయితే.. బర్త్ డే పార్టీ కోసం హైదరాబాద్‌కు చెందిన రెండు కుటుంబాలు మే 29న గోవా వెళ్లినట్లు తెలుస్తోంది. ఒక కుటుంబంలో 11 మంది, మరో కుటుంబంలో 21 మంది వెళ్లారు. డ్రైవర్‌తో పాటు ఇద్దరు క్లీనర్లు ఉన్నారు. మృతులు అర్జున్‌కుమార్, సరళ, అర్జున్, శివకుమార్, రవళి, దీక్షిత్, అనితగా గుర్తించారు. ప్రమాదం జరిగిన వెంటనే తాము సహాయక చర్యలు చేపట్టామని స్థానికుడొకరు తెలిపారు. అయితే.. క్షణాల్లోనే బస్సులో మంటలు చెలరేగి ఆహుతైందన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com