8th Pay Commission : లక్షల్లో జీతాలు.. కోట్లలో ఆశలు.. 8వ వేతన సంఘం దెబ్బకు కేంద్ర ఉద్యోగుల దశ తిరగబోతోందా?

8th Pay Commission : లక్షల్లో జీతాలు.. కోట్లలో ఆశలు.. 8వ వేతన సంఘం దెబ్బకు కేంద్ర ఉద్యోగుల దశ తిరగబోతోందా?
X

8th Pay Commission : కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరి దృష్టి ఇప్పుడు 8వ వేతన సంఘం పైనే ఉంది. కొత్త పే కమిషన్ అమలులోకి వస్తే జీతాలు ఎంత పెరుగుతాయి? ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉండబోతోంది? అన్న చర్చలు ఊపందుకున్నాయి. అయితే, ఈసారి జీతాల పెంపు అనేది కేవలం ఉద్యోగ సంఘాల డిమాండ్లపైనే కాకుండా, ఒక కీలక అంశంపై ఆధారపడి ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అదే కరువు భత్యం(DA). కొత్త శాలరీ స్ట్రక్చర్ ఖరారయ్యే సమయంలో డీఏ ఏ స్థాయిలో ఉందనేది జీతాల పెంపును శాసించబోతోంది.

ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటే ఏమిటి? ఇది ఎందుకు ముఖ్యం?

సాధారణంగా ప్రభుత్వ ఉద్యోగుల బేసిక్ శాలరీని సవరించేందుకు ఉపయోగించే మల్టిప్లయర్‎నే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అంటారు. 7వ వేతన సంఘం సమయంలో ఇది 2.57గా ఉంది. ఉదాహరణకు అప్పట్లో కనీస వేతనం రూ.7,000 ఉండగా, దానికి 2.57 గుణకాన్ని వర్తింపజేయడంతో అది రూ.18,000కి పెరిగింది. ఇప్పుడు 8వ వేతన సంఘంలో ఈ ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ ఎంత ఉంటుందనే దానిపైనే ఉద్యోగుల ఆశలన్నీ ఉన్నాయి.

డీఏ పాత్ర ఇక్కడ ఎందుకు కీలకం?

కొత్త పే కమిషన్ సిఫార్సులు అమలు చేసే ముందు, అప్పటివరకు పేరుకుపోయిన డీఏను ప్రాథమిక వేతనంలో కలుపుతారు. దీనినే శాలరీ రివిజన్ బేస్ అంటారు. 6వ వేతన సంఘం ముగిసి 7వ వేతన సంఘం వచ్చే సమయానికి డీఏ 125 శాతానికి చేరుకుంది. అందుకే అప్పట్లో జీతాల సవరణ భారీగా జరిగింది. కానీ, ప్రస్తుతం డీఏ 58 శాతంగా ఉంది. 8వ వేతన సంఘం సిఫార్సులు అమలులోకి వచ్చే సమయానికి ఇది గరిష్టంగా 68-70 శాతానికి చేరవచ్చు. డీఏ బేస్ తక్కువగా ఉండటం వల్ల, ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్ అనుకున్నంత స్థాయిలో భారీగా ఉండకపోవచ్చని ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు.

ఉద్యోగ సంఘాల డిమాండ్లు ఇవే..

ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్స్ వంటి సంఘాలు జీతాల్లోని అసమానతలను తొలగించాలని డిమాండ్ చేస్తున్నాయి. వారు ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను కేటగిరీల వారీగా 3.0 నుంచి 3.25 మధ్య ఉండాలని ప్రతిపాదించారు.

* లెవల్ 1 నుంచి 5 వరకు: 3.0 ఫిట్‌మెంట్.

* లెవల్ 17 నుంచి 18 వరకు (సీనియర్ అధికారులు): 3.25 ఫిట్‌మెంట్.

అయితే ప్రభుత్వం 1.83 నుంచి 2.57 మధ్య మాత్రమే ఫిట్‌మెంట్ ఫ్యాక్టర్‌ను ఉంచే అవకాశం ఉందన్న వార్తలు కూడా వస్తున్నాయి. తుది నిర్ణయం అనేది ద్రవ్యోల్బణం, ప్రభుత్వ ఖజానా పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది.

ఎప్పుడు అమలులోకి వస్తుంది?

జనవరి 2025లో ప్రభుత్వం 8వ వేతన సంఘాన్ని ప్రకటించినప్పటికీ, ప్రక్రియ పూర్తి కావడానికి 18 నుంచి 24 నెలల సమయం పడుతుంది. 2026 నాటికి ఉద్యోగ సంఘాలతో చర్చలు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. డీఏ స్థాయి తక్కువగా ఉండటం ఒక ప్రతిబంధకమే అయినప్పటికీ, ఉద్యోగుల ఒత్తిడి మేరకు ప్రభుత్వం మధ్యేమార్గంగా వేతన పెంపును ప్రకటించే అవకాశం ఉంది.

Tags

Next Story