భారత్‌లో కొత్తగా 90,122 కరోనా పాజిటివ్ కేసులు

భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 11లక్షల 16 వేల 842 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 90,122 పాజిటివ్ కేసులు బయట పడ్డాయి. దేశంలో కరోనా కేసుల సంఖ్య 50లక్షల 20వేల 359కు చేరిందని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ వెల్లడించింది. వీరిలో ఇప్పటికే 39లక్షల మంది కోలుకోగా మరో 9లక్షల 95వేల యాక్టివ్ కేసులు ఉన్నట్టు తెలిపింది. మంగళవారం ఒక్కరోజే అత్యధికంగా 82వేల మంది కోలుకున్నారు.
భారత్‌లో కరోనా మరణాల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఒక్కరోజులో 1290 మంది కరోనా రోగులు ప్రాణాలు కోల్పోయారు. 24గంటల వ్యవధిలో ఇన్ని మరణాలు సంభవించడం ఇదే తొలిసారి. రోజువారీ మరణాలు 1200దాటడం ఇది మూడోసారి. దేశంలో ఇప్పటివరకు కరోనా సోకి మృతి చెందిన వారిసంఖ్య 82వేల 66కి చేరింది. కొవిడ్-19తో మరణిస్తున్న వారిలో దాదాపు 70శాతానికి పైగా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నవారేనని కేంద్ర ఆరోగ్యశాఖ స్పష్టంచేస్తోంది.
దేశంలో కరోనా బాధితుల రికవరీ రేటు 78.5శాతానికి చేరడం ఉపశమనం కలిగించే విషయమని నిపుణులు చెబుతున్నారు. మరణాల రేటు మాత్రం 1.63శాతంగా ఉన్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 5కోట్ల 94లక్షల శాంపిళ్లు సేకరించి... కొవిడ్ టెస్టులు పూర్తి చేసినట్టు భారత వైద్య పరిశోధన మండలి తెలిపింది. మరోవైపు... ప్రపంచంలో కరోనా వైరస్ అధిక తీవ్రత ఉన్న అమెరికాలో ఇప్పటికే 66లక్షల కేసులు బయటపడ్డాయి. వీరిలో లక్షా 95వేల మంది ప్రాణాలు కోల్పోయారు. భారత్‌లో ప్రస్తుతం పాజిటివ్ కేసుల సంఖ్య 50లక్షలు దాటింది. కరోనా మరణాలు అత్యధికంగా అమెరికాలో చోటుచేసుకోగా.... బ్రెజిల్‌లో లక్షా 33 వేల మంది, భారత్‌లో 82వేల మరణాలు సంభవించాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com