YouTuber Jyoti Malhotra : యూట్యూబర్ జ్యోతీమల్హోత్రా కేసులో కీలక మలుపు

పాకిస్తాన్ కు గూఢచర్యం చేస్తూ అరెస్టయిన హర్యానా యూట్యూబర్ జ్యోతీ మల్హోత్రా కేసులో కీలక విషయాలు బయటికి వస్తున్నాయి. పహల్గాంలో ఉగ్రదాడి జరగడానికి కొన్ని నెలల ముందు ఆమె ఆ ప్రాంతానికి వెళ్లినట్లు దర్యాప్తులో వెల్లడైంది. పాకిస్థాన్ ఐఎస్ఐతో సంబంధాలున్న ఆ దేశ హైకమిషన్ ఉద్యోగి డానిష్ జ్యోతి సాన్నిహిత్యంగా ఉంటున్నట్టు తేలింది. ఏప్రిల్ 22న పహెల్గాం లో పర్యాటకులపై భీకర ఉగ్రదాడి జరిగిన సంగతి విదితమే. ఈ ఘటన జరగడానికి మూడు నెలల ముందు యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా పహెల్గాం వెళ్లి అక్కడ వీడియోలు తీసినట్లు సమాచారం. ఆ సమాచారాన్ని పాక్ ఏజెం ట్లకు చేరవేసి ఉంటుందని అధికారులు అనుమానిస్తున్నారు. దీనిపై పోలీసులు మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. పహెల్గాం దాడికి ముందు ఆమె పలుమార్లు పాకిస్థాన్లో పర్యటించిందని, ఒకసారి చైనాకూ వెళ్లొచ్చినట్లు పోలీసులు వెల్లడించారు. 'ఆపరేషన్ సిందూర్' అనంతరం నెలకొన్న ఉద్రిక్తతల సమయంలో ఆమె ఢిల్లీలోని పాక్ రాయబార కార్యాలయంలోని అధికారి డానిష్తో టచ్లో ఉన్నట్లు నిర్ధరించారు. జ్యోతిని అతడు ట్రాప్ చేసినట్లు గుర్తించారు. ట్రావెల్ బ్లాగర్, యూట్యూబర్ అయిన జ్యోతి మల్హోత్రా ట్రావెల్ విత్ జో పేరుతో ఓ యూట్యూబ్ ఛానెల్ నిర్వహిస్తోంది. 2023లో పాక్ కు వెళ్లిన సమయంలో డానిష్ ఆమెకు పరిచయమయ్యాడు. భారత్కు వచ్చిన తర్వాత కూడా అతడితో సంప్రదింపులు కొనసాగించినట్లు పోలీసులు దర్యాప్తులో వెల్లడైంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com