Adani Group : భారత ఏవియేషన్ రంగంలో సరికొత్త చరిత్ర..అదానీ చేతికి విమానాల తయారీ పగ్గాలు.

Adani Group : గౌతమ్ అదానీ నేతృత్వంలోని అదానీ గ్రూప్ మరో సంచలనానికి తెరలేపింది. ఇప్పటికే ఓడరేవులు, విమానాశ్రయాలు, ఇంధన రంగాల్లో రారాజుగా వెలుగొందుతున్న అదానీ, ఇప్పుడు నేరుగా విమానాల తయారీ రంగంలోకి అడుగుపెడుతున్నారు. బ్రెజిల్‌కు చెందిన ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఏరోస్పేస్ దిగ్గజం ఎంబ్రాయర్‌తో అదానీ గ్రూప్ భారీ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మహా డీల్ ద్వారా భారత్ త్వరలోనే విమానాల తయారీ కేంద్రంగా మారబోతోంది. ఇది ప్రపంచ దిగ్గజాలైన బోయింగ్, ఎయిర్‌బస్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడమే కాకుండా, దేశంలో వేల సంఖ్యలో కొత్త ఉద్యోగాలను సృష్టించనుంది.
విమానయాన రంగంలో భారత్ ప్రస్తుతం ప్రపంచంలోనే వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్. ఈ అవకాశాన్ని ఒడిసిపట్టుకోవడానికి అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ విభాగం బ్రెజిల్ ఏరోనాటికల్ కంపెనీ ఎంబ్రాయర్‌తో వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని ప్రకటించింది. మంగళవారం ఢిల్లీలో పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఈ ఒప్పందంపై సంతకాలు జరిగాయి. ఈ సందర్భంగా పౌర విమానయాన కార్యదర్శి సమీర్ కుమార్ సిన్హా మాట్లాడుతూ.. ఈ ఒప్పందం కేవలం విమానాల అసెంబ్లింగ్ కే పరిమితం కాదని, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, నైపుణ్యాభివృద్ధి, బలమైన సరఫరా గొలుసు వ్యవస్థను నిర్మించడమే లక్ష్యమని పేర్కొన్నారు.
అదానీ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ డైరెక్టర్ జీత్ అదానీ ఈ ప్రాజెక్ట్ గురించి కీలక విషయాలు వెల్లడించారు. ఎంబ్రాయర్ భాగస్వామ్యంతో భారత్‌లో ఒక ప్రాంతీయ విమాన తయారీ ప్లాంట్‌ను స్థాపించనున్నట్లు ఆయన తెలిపారు. ఎంబ్రాయర్ కంపెనీకి 150 సీట్ల సామర్థ్యం గల కమర్షియల్ జెట్ విమానాలను తయారు చేయడంలో ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది. ఇప్పుడు అదే టెక్నాలజీతో భారత్‌లో ఫైనల్ అసెంబ్లీ లైన్ ఏర్పాటు చేయబోతున్నారు. దీనివల్ల భారతీయ ఎయిర్‌లైన్స్ కంపెనీలు విమానాల కోసం విదేశాలపై ఆధారపడాల్సిన అవసరం తగ్గుతుంది.
ఈ భాగస్వామ్యం భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి పెద్ద ఊతాన్ని ఇవ్వనుంది. అదానీ గ్రూప్ ప్రతినిధి ఆశిష్ రాజవంశీ మాట్లాడుతూ.. దేశీయంగా విమానాల తయారీ వల్ల విమాన ప్రయాణ ఖర్చులు తగ్గే అవకాశం ఉందని, ఇది చిన్న పట్టణాలకు విమాన సర్వీసులను అనుసంధానించడంలో కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. విమానాల తయారీ కేంద్రంగా భారత్ ఎదగడం వల్ల ఇంజనీరింగ్, టెక్నికల్ రంగాల్లో వేల సంఖ్యలో నిపుణులకు ఉపాధి దొరకనుంది. మొత్తానికి అదానీ గ్రూప్ వేస్తున్న ఈ అడుగు అంతర్జాతీయ ఏవియేషన్ రంగంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
