Agra : తాజ్ మ‌హ‌ల్‌ను చూసేందుకు ఫ్రీ ఎంట్రీ.. ఎన్నిరోజులంటే

Agra :  తాజ్ మ‌హ‌ల్‌ను చూసేందుకు ఫ్రీ ఎంట్రీ.. ఎన్నిరోజులంటే
X
ప‌ర్యాట‌కుల‌కు గుడ్‌న్యూస్‌

ప్రేమ సౌధం తాజ్ మ‌హ‌ల్‌ను వీక్షించాల‌నుకునే ప‌ర్యాట‌కుల‌కు గుడ్‌న్యూస్‌. వ‌రుస‌గా మూడురోజుల పాటు ఎలాంటి ఎంట్రీ ఫీజు చెల్లించకుండానే ఉచితంగానే ప్ర‌వేశం క‌ల్పించ‌నున్నారు. మొఘ‌ల్ చ‌క్ర‌వ‌ర్తి షాజ‌హాన్ 370వ ఉర్సు సంద‌ర్భంగా ఈ అవ‌కాశం క‌ల్పిస్తున్నారు. జ‌న‌వ‌రి 26 నుంచి 28 వ‌ర‌కు మూడురోజుల పాటు ఉర్సు జ‌రుగ‌నున్న‌ది. ఈ సందర్భంగా పర్యాటకులకు ఉచితంగా తాజ్ మహల్ అందాలను వీక్షించే అవ‌కాశం క‌ల్పించారు. ఏటా షాజ‌హాన్ వ‌ర్ధంతి సంద‌ర్భంగా ఉర్సు నిర్వ‌హించ‌డం ఆన‌వాయితీగా వ‌స్తున్న‌ది. ఈ క్ర‌మంలో మూడురోజుల పాటు ప‌ర్యాట‌కులు తాజ్ అందాల‌ను చూసి అనుభూతి చెందే అవ‌కాశం ద‌క్క‌నున్న‌ది.

అదే స‌మ‌యంలో సంద‌ర్శ‌కులు షాజ‌హాన్‌తో పాటు ముంతాజ్ ఒరిజిన‌ల్ స‌మాధుల‌ను చూసేందుకు వీలుంటుంది. ఇత‌ర స‌మ‌యాల్లో సంద‌ర్శ‌కుల‌కు ఈ అవ‌కాశం ఉండ‌దు. ఉర్సు స‌మ‌యంలోనే ప్ర‌త్యేకంగా అండ‌ర్‌గ్రౌండ్ ద్వారాల‌ను తెరుస్తారు. ఈ స‌మ‌యంలోనే ప‌ర్యాట‌కుల‌కు షాజ‌హాన్‌, ముంతాజ్‌ల స‌మాధుల‌ను చూసే అవ‌కాశం వ‌స్తుంది. ఉర్సు తొలిరోజు స‌మాధుల‌ను శుద్ధి చేసి ప్రార్థ‌న‌లు చేస్తారు. రెండోరోజు సుగంధ ద్రవ్య పరిమిళాల వేడుకలు జ‌రుపుతారు. అలాగే ఖ‌వ్వాలీ జ‌రుగుతుంది. 28న ఖురాన్ఖ్వానీ, ఖుల్ కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించి చాద‌ర్‌ను అలంక‌రిస్తారు. మొదటి చాదర్‌ను ఉర్సు కమిటీ అందజేస్తుంది.

Tags

Next Story