Ahmedabad : అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. బోయింగ్‌పై అమెరికాలో దావా

Ahmedabad : అహ్మదాబాద్‌ విమాన ప్రమాదం.. బోయింగ్‌పై అమెరికాలో దావా
X

అహ్మదాబాద్‌లో ఇటీవల జరిగిన ఎయిరిండియా విమాన ప్రమాదం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ దుర్ఘటనలో మరణించిన నలుగురి కుటుంబాలు, విమాన తయారీ సంస్థలైన బోయింగ్‌, హనీవెల్‌పై అమెరికాలో దావా వేశాయి. తమ ప్రియమైన వారిని కోల్పోయిన ఆ కుటుంబాలు మంగళవారం ఈ పిటిషన్‌ను దాఖలు చేశాయి. ఈ దావాలో బాధిత కుటుంబాలు, విమానంలో వాడిన ఇంధన స్విచ్‌లు లోపభూయిష్టంగా ఉండటమే ప్రమాదానికి ప్రధాన కారణమని ఆరోపించాయి. 787 డ్రీమ్‌లైనర్‌ విమానం డిజైన్‌, విడిభాగాల అభివృద్ధి సమయంలోనే ఈ లోపాలు బోయింగ్‌, హనీవెల్‌ సంస్థలకు తెలుసని.. అయినా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదని పిటిషన్‌లో పేర్కొన్నారు. విమాన ఇంధన సరఫరా, థ్రస్ట్‌ నియంత్రణకు సంబంధించిన డిజైన్‌లో లోపం ఉందని ఈ కుటుంబాలు ఆరోపించాయి.

అకస్మాత్తుగా సంభవించే ప్రమాదాలను నివారించడానికి ఆ రెండు సంస్థలు తగిన జాగ్రత్తలు తీసుకోలేదని కూడా దావాలో పేర్కొన్నారు. ఇంధన స్విచ్‌లకు తనిఖీలు, మరమ్మతులు అవసరమని విమానయాన సంస్థలను హెచ్చరించడంలో కూడా ఈ సంస్థలు విఫలమయ్యాయని తెలిపారు. అంతేకాకుండా వాటిని మార్చడానికి అవసరమైన విడిభాగాలను కూడా సకాలంలో అందించలేదని ఆరోపించారు. ఈ ఆరోపణలపై బోయింగ్‌, హనీవెల్‌ సంస్థలు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.

విమాన ప్రమాద వివరాలు. ఈ దుర్ఘటన జూన్‌ 12న చోటుచేసుకుంది. అహ్మదాబాద్‌ నుంచి లండన్‌కు వెళ్లాల్సిన ఎయిరిండియా డ్రీమ్‌లైనర్‌ విమానం టేకాఫ్‌ అయిన కొన్ని క్షణాల్లోనే కుప్పకూలింది. విమానంలో ఉన్న మొత్తం 242 మందిలో కేవలం ఒక్కరు మాత్రమే ప్రాణాలతో బయటపడగా, మిగిలిన 241 మంది మరణించారు. ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో తన ప్రాథమిక నివేదికలో ఈ ప్రమాదం ఇంజిన్‌లకు ఇంధన సరఫరా నిలిచిపోవడం వల్లే జరిగిందని పేర్కొంది. అయితే యూఎస్‌ ఫెడరల్‌ ఏవియేషన్‌ అడ్మినిస్ట్రేషన్‌ మాత్రం బోయింగ్‌ విమానాల్లోని ఇంధన నియంత్రణ స్విచ్‌లు సక్రమంగానే పనిచేస్తున్నాయని తెలిపింది

Tags

Next Story