Akhilesh Yadav : నిర్వహణ లోపం వల్లే తొక్కిసలాట: అఖిలేశ్ యాదవ్

మహా కుంభమేళాలో తొక్కిసలాటలో భక్తులు మరణించడం చాలా బాధాకరం అని ఎంపీ అఖిలేశ్ యాదవ్ అన్నారు. నిర్వహణ లోపం వల్లే ఈ ప్రమాదం జరిగిందని ఆరోపించారు. చనిపోయిన వారి మృతదేహాలను గుర్తించి వారి బంధువులకు అప్పగించాలన్నారు. ఈ ఘటన నుంచి ప్రభుత్వం గుణపాఠం నేర్చుకుని భక్తుల కోసం వసతి, భోజనం, నీటి సౌకర్యాలకు అదనపు ఏర్పాట్లు చేయాలని ట్వీట్ చేశారు. ప్రమాదంలో గాయపడిన వారందరూ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
మహా కుంభమేళాలో తొక్కిసలాట జరగడంపై బీఎస్పీ చీఫ్ మాయావతి దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు. ‘ఘటనలో ప్రాణాలు కోల్పోయినవారి ఆత్మకు శాంతి చేకూరాలి. వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేస్తున్నా. క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నా’ అని ట్వీట్ చేశారు. అర్ధరాత్రి జరిగిన తొక్కిసలాటలో పలువురు చనిపోయినట్లు అధికారిక ప్రకటన రాలేదు. ఈక్రమంలోనే మృతులకు సంతాపం తెలియజేస్తున్నానని మాయావతి ట్వీట్ చేయడం గమనార్హం.
మరోవైపు ప్రయాగ్‌రాజ్‌లో తొక్కిసలాట జరిగిన సంగం ఘాట్ వద్దకు రావొద్దని సీఎం యోగి ఆదిత్యనాథ్ భక్తులకు సూచించారు. తమకు సమీపంలోని ఘాట్ల వద్ద అమృత స్నానాలు ఆచరించాలని కోరారు. భక్తకోటి కోసం వేర్వేరు ఘాట్లను ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మిగతా అన్ని చోట్లా అంతా ప్రశాంతంగా ఉందని తెలిపారు. ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉండేందుకు అధికారుల సూచనలు పాటించాలని కోరారు. నేడు మహా కుంభమేళాకు 10 కోట్ల మంది వచ్చినట్టు అంచనా.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com