Pneumonia: చైనాలో న్యుమోనియా కేసుల ఉద్ధృతి

Pneumonia:  చైనాలో న్యుమోనియా కేసుల ఉద్ధృతి
కేరళలో ఆరోగ్యశాఖ అధికారుల అలర్ట్

ప్రపంచాన్ని గడగడలాడించిన కరోనా మహమ్మారికి పుట్టినిల్లుగా చెడ్డపేరు మూటగట్టుకున్న చైనా... ఇప్పుడు మరోసారి అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. గత కొన్ని రోజులుగా చైనాలో న్యుమోనియో తరహా కేసులు విపరీతంగా నమోదవుతుండడమే అందుకు కారణం. చైనాలోని ఆసుపత్రులన్నీ రోగులతో కిటకిటలాడుతున్నాయని, రోగ లక్షణాలు న్యుమోనియాను పోలి ఉన్నాయని అంతర్జాతీయ మీడియా సంస్థలు చెబుతున్నాయి. కాగా, చైనా ఆసుపత్రుల్లో ఈ తరహా లక్షణాలతో చేరుతున్న వారిలో పిల్లలే అత్యధికంగా ఉన్నారని ఆయా కథనాల్లో పేర్కొన్నారు. దీనిపై భారత కేంద్ర ప్రభుత్వం స్పందించింది.

చైనాలో న్యుమోనియా తరహా కేసుల తీవ్రతను గమనిస్తున్నామని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఈ విషయంలో కేంద్రం అప్రమత్తంగానే ఉందని స్పష్టం చేశారు. చైనాలో న్యుమోనియా కేసుల ఉద్ధృతిని ఐసీఎంఆర్, డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ నిశితంగా పరిశీలిస్తున్నట్టు వివరించారు. ఆ మేరకు తగిన చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏదేమైనా భారత్ కు న్యుమోనియా ముప్పు తక్కువేనని నిన్న ఓ ప్రకటనలో కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది.


చైనా దేశంలోని పిల్లల్లో హెచ్9ఎన్2 మహమ్మారి వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో కేరళ ఆరోగ్యశాఖ అదికారులు అప్రమత్తమయ్యారు. చైనాలోని పిల్లలకు ఏవియన్ ఇన్‌ఫ్లుఎంజా వైరస్ కేసులు, శ్వాసకోశ వ్యాధులు వస్తున్న దృష్ట్యా కేరళలోని వైద్యనిపుణులతో ఆ రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి వీణాజార్జ్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. పిల్లల్లో కనిపించే న్యుమోనియాకు సంబంధించి ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో పరిస్థితిని విశ్లేషించేందుకు తాము వైద్యాధికారులతో సమావేశమయ్యానని మంత్రి వీణా జార్జ్ చెప్పారు. కొవిడ్ మహమ్మారి కారణంగా పిల్లల్లో రోగనిరోధక శక్తి తగ్గిందని, అందువల్లే హెచ్9ఎన్2 మహమ్మారి ప్రబలుతోందని మంత్రి పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story