Amazon: 2030 నాటికి భారత్‌లో అమెజాన్ భారీ పెట్టుబడులు..

ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్భా రత్‌లో భారీ పెట్టుబడులు పెట్టనుంది. 2030 నాటికి దేశంలోని అన్ని వ్యాపారాల్లో 35 బిలియన్ డాలర్లకుపైగా పెట్టుబడులు పెట్టనుంది. ఈ విషయాన్ని కంపెనీ అధికారి ఒకరు తాజాగా వెల్లడించారు.
దేశ రాజధాని న్యూఢిల్లీలోని భారత్ మండపంలో అమెజాన్ సంభవన్ 2025 నిర్వహిస్తోంది. ఇందులోనే భారతదేశంలో పెట్టుబడులకు సంబంధించి అమెజాన్ అధికారిక ప్రకటన చేసింది. 2030 నాటికి 35 బిలియన్ డాలర్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అమెజాన్ సీనియర్ అధికారి అమిత్ అగర్వాల్ ప్రకటించారు. ఏఐ, ఉద్యోగాల కల్పన, వ్యాపార విస్తరణపై ఈ మొత్తాన్ని వెచ్చించనున్నట్లు తెలిపారు. ఈ పెట్టుబడులు కంపెనీ విస్తరణకే కాదు భారతదేశ అభివృద్ధికి ఉత్ప్రేరకంగా ఉపయోగపడతాయని అన్నారు. కాగా, 2010 నుంచి ఇప్పటివరకు అమెజాన్ భారతదేశంలో 40 బిలియన్ డాలర్లు పెట్టుబడి పెట్టింది. దీనికి అదనంగా వచ్చే ఐదేళ్లలో అంటే 2030 నాటికి మరో 35 బిలియన్ డాలర్లు ఇన్వెస్ట్ చేయనుంది.
అంతేకాదు, 2030 నాటికి భారత్‌లో అమెజాన్ అదనంగా 1 మిలియన్ (10 లక్షల) ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను (million jobs) సృష్టించాలని యోచిస్తోంది. కేవలం ప్యాకేజింగ్, లాజిస్టిక్ విభాగాల్లోనే కాకుండా ఇతర విభాగాల్లోనూ ఉద్యోగాలను కల్పించనున్నట్లు అమెజాన్ వెల్లడించింది. భారతదేశంలో డిజిటల్ మౌలిక సదుపాయాల బలోపేతం, చిన్న మధ్య తరహా వ్యాపారాలకు మద్దతు ఇవ్వడం, ఉపాధి అవకాశాలను పెంపొందించడం వంటి లక్ష్యాలతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెజాన్ ప్రకటించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

