Sim Cards: 2.17 కోట్ల సిమ్‌లు రద్దు
సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. సైబర్ క్రైమ్‌కు ప్రధాన కారణంగా మారిన సిమ్ కార్డులు, మొబైల్ ఫోన్లపై దృష్టిపెట్టింది. నకిలీ డాక్యుమెంట్లతో తీసుకున్న, సైబర్ నేరాలకు దుర్వినియోగం చేస్తున్న 2.17 కోట్ల సిమ్ కార్డులను రద్దు చేస్తామని, సుమారు 2.26 లక్షల మొబైల్ ఫోన్లను బ్లాక్ చేస్తామని కేంద్ర టెలికమ్యూనికేషన్స్ శాఖ.. ఉన్నతస్థాయి ప్యానెల్‌కు చెప్పినట్టు తెలిసింది. ఇటీవల కేంద్ర హోంమంత్రిత్వ శాఖ నిర్వహించిన సమావేశంలో ఈ కనెక్షన్ల రద్దుకు సంబంధించిన సమాచారాన్ని టెలికాం శాఖ పంచుకున్నట్టు తెలిసింది. అలాగే సిమ్ కార్డుల జారీ సమయంలో కేవైసీ (నో యువర్ కస్టమర్)ను మరింత సమర్థవంతంగా అమలు చేస్తామని తెలిపింది.
ఈ సమావేశంలో బ్యూరో ఆఫ్ ఇమ్మిగ్రేషన్, ఆర్బీఐ, ఎన్‌ఐఏ, ఐటీ శాఖ, సీబీఐ అధికారులు, ఇతర భద్రత ఏజెన్సీలకు చెందిన నిపుణులు, రాష్ట్రాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ అంచనా ప్రకారం ఈ ఏడాది మార్చికి ముందు 6 నెలల కాలంలో భారతీయులు సైబర్ నేరాల బారినపడి సుమారు రూ.500 కోట్లు పోగొట్టుకున్నారు. దీనిపై దృష్టిపెట్టిన కేంద్ర ప్రభుత్వం సైబర్ నేరాలపై ఉన్నతస్థాయి ప్యానెల్‌ను ఏర్పాటు చేసింది. ‘నిర్దేశిత పరిమితికి మించి, ఫోర్జరీ డాక్యుమెంట్లతో తీసుకున్న.. లేదా సైబర్ నేరాలకు వినియోగించిన సుమారు 2.17 కోట్ల సిమ్ కార్డులను టెలికాం శాఖ డిస్‌కనెక్ట్ చేయనుంది. అలాగే 2.26 లక్షల మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయనుంది’ అని ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి.
డేటా ఎంట్రీ పోస్టులకు భారీగా వేతనాల ఆశ చూపి.. సైబర్ మోసాలు చేయించేవారని తెలిసింది. టెలీకాలర్స్‌గా ఫోన్ చేసి.. క్రిప్టోకరెన్సీలో పెట్టుబడులు పెడితే.. భారీగా లాభాలు వస్తాయంటూ మోసగించడమే వీరి పని. ఈ విషయం గురించి సోషల్ మీడియాలో వైరల్ అయి.. వెలుగులోకి రావడంతో కేంద్ర ప్రభుత్వం.. పలు మంత్రిత్వ శాఖలతో కలిపి ఒక కమిటీ వేసింది. టెలికాం, బ్యాంకింగ్, ఇమిగ్రేషన్ సహా పలు సెక్టార్లలో ఉన్న లోపాల్ని గుర్తించింది కమిటీ. ఈ నేపథ్యంలోనే భారతీయ నంబర్ల మాదిరిగా.. కనిపించే ఇంటర్నేషనల్ నంబర్స్/కాల్స్‌ను బ్లాక్ చేయాలని.. కొంత కాలం కిందటే.. టెలికాం శాఖ.. టెలికాం ఆపరేటర్స్‌కు ఆదేశాలు జారీ చేసింది. మరి సిమ్ కార్డుల రద్దు, మొబైల్ హ్యాండ్‌సెట్స్ బ్లాకింగ్‌కు సంబంధించి.. అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com