Amit Shah : 'శ్రీవిజయపురం'గా పోర్టుబ్లెయిర్.. అమిత్ షా కీలక ట్వీట్

వలసవాద ముద్రల నుంచి దేశాన్ని విముక్తి చేసేందుకు కేంద్రం మరో అడుగు ముందుకేసింది. అండమాన్,నికోబార్ దీవుల రాజధాని నగరమైన పోర్ట్ బ్లెయిర్ పేరును 'శ్రీ విజయపురం'గా మార్చింది. అండమాన్, నికోబార్ దీవులకు పోర్ట్ బ్లెయిర్ ముఖద్వారం. ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన బ్రిటిష్ కలోనియల్ నేవీ అధికారి అయిన కెప్టెన్ ఆర్చిబాల్డ్ బ్లెయిర్ పేరు మీదుగా ఈ నగరానికి అప్పట్లో ఆ పేరుపెట్టారు.
తాజాగా కేంద్ర ప్రభుత్వం ఈ నగరాన్ని శ్రీ విజయపురంగా వ్యవహరించనున్నట్లు తెలిపింది. "వలసవాద గుర్తుల నుంచి దేశానికి విముక్తి కల్పించాలన్న ప్రధాని మోడీ ఆశయాలకు అనుగుణంగా పోర్ట్ బ్లెయిర్ పేరును శ్రీవిజపురంగా మార్చాలని నిర్ణయించాం. మనుపటి పేరు వలసవాద వారసత్వాన్ని సూచిస్తోంది. శ్రీ విజయపురం అనేది భారత స్వాతంత్య్ర పోరాటంలో సాధించిన విజయానికి సంకేతం. నాటి పోరాటంలో అండమాన్ నికోబార్ పాత్ర ఎంతో ప్రత్యేకమైనది" అని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ( Amit Shah ) ఎక్స్ వేదికగా తెలిపారు.
"చరిత్రతోపాటు స్వాతంత్య్ర పోరాటంలోనూ ఈ దీవులది కీలక భూమిక. చోళ సామ్రాజ్యంలో నౌకాదళ స్థావరంగా ఈ ప్రాంతం ఉండేది. ప్రస్తుతం మనదేశ వ్యూహాత్మక, అభివృద్ధి ఆశయాలకు కేంద్రంగా పనిచేస్తోంది. మన జాతీయ పతాకాన్ని మొదటిసారి నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఇక్కడే ఎగరవేశారు. వీర్ సావర్కర్ సహాఅనేక మంది స్వాతంత్య్ర సమర యోధులు జైలు జీవితం గడిపింది కూడా ఇక్కేడే" అని అమితా గుర్తుచేశారు. జూలైలో రాష్ట్రపతి భవన్ లోని ఐకానిక్ 'దర్బార్ హాల్', 'అశోక్ హాల్' పేర్లను వరుసగా 'గణతంత్ర మండపం', 'అశోక్ మండపం'గా మార్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com