Andhra Pradesh: వరికపుడిశెల ఎత్తిపోతలకు సీఎం జగన్ శంకుస్థాపన..

ఎన్నికలు సమీపిస్తుండటంతో ప్రజలను మోసం చేసేందుకు పాతమిత్రులంతా మళ్లీ ఒక్కటయ్యారని , మేనిఫెస్టోలు, హామీల పేరిట జిమ్మిక్కులు చేస్తున్నారని ముఖ్యమంత్రి జగన్ విమర్శించారు. గతంలో కలిసి పోటీ చేసినప్పుడు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆయన ప్రశ్నించారు. మాచర్లలో వరికపూడిశెల ఎత్తిపోతల పథకం ప్రారంభించిన సీఎం జగన్ పల్నాడు జిల్లా అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు.
కృష్ణమ్మ చెంతనే ఉన్నా పల్నాడు జిల్లాలో గుక్కెడు తాగునీటికి కటకటలాడాల్సిన పరిస్థితులు ఉన్నాయని, ప్రజల దాహర్తిని తీర్చేందుకే వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్ట్‌కు శ్రీకారం చుట్టినట్లు సీఎం జగన్ తెలిపారు. గత పాలకులు ఎలాంటి అనుమతులు లేకుండానే ఎన్నికల ముందు హడావుడిగా ఈ ప్రాజెక్ట్‌కు శంకుస్థాపన చేసి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. పల్నాడు గడ్డను అభివృద్ధికి అడ్డాగా మారుస్తామని జగన్ హామీ ఇచ్చారు. చంద్రబాబుకు సంక్షేమం అంటేనే పట్టదని ఆయన ఎప్పుడూ వర్తమానం గురించి కాకుండా 50 ఏళ్లు ముందు ఆలోచిస్తానంటూ ప్రజలను బురిడీ కొట్టిస్తారని జగన్ ఎద్దేవా చేశారు. మళ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో అమలు చేయలేని హామీలతో ప్రజలను మోసం చేసేందుకు వస్తున్నారన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికలకు సరిగ్గా నెల ముందు గత పాలకులు ఈ ప్రాజెక్టుకు హడావుడిగా శంకుస్థాపన చేశారని జగన్ గుర్తుచేశారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే, భూ సేకరణ చేపట్టకుండానే టెంకాయ కొట్టి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. తమ ప్రభుత్వం వచ్చాక ఈ ప్రాజెక్టు కోసం పట్టుదలగా ప్రయత్నాలు చేపట్టామని, ఈ నెల 6న అటవీ శాఖ అనుమతులు రావడంతో ప్రస్తుతం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశామని వివరించారు. ఈమేరకు మాచర్ల పట్టణంలో బుధవారం జరిగిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి జగన్ పాల్గొన్నారు. పనులన్నీ పూర్తయి ప్రాజెక్టు అందుబాటులోకి వచ్చాక 1.25 లక్షల ఎకరాలకు సాగు నీరు అందుతుందని చెప్పారు. ప్రారంభ దశలలో వరికపూడిశెల ఎత్తిపోతల ప్రాజెక్టుతో 25 వేల ఎకరాలకు సాగు నీరు, 20 వేల మందికి తాగునీరు అందిస్తామని పేర్కొన్నారు. ఏపీలో పూర్తిగా పైప్ లైన్ ద్వారా నీరందించే తొలి ప్రాజెక్టు ఇదేనని ముఖ్యమంత్రి జగన్ వెల్లడించారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 17న నూజివీడుకు వెళ్లనున్నారు. అసైన్మెంట్ భూములకు సంబంధించిన పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారాయన. కార్యక్రమంలో 2003కు మందు అసైన్మెంట్ భూములకు హక్కు కల్పించడంతో పాటు కొత్త అసైన్మెంట్ భూములకు పట్టాల పంపిణీ జరగనుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com