MANIPUR: మణిపుర్‌లో మళ్లీ హింసాకాండ

MANIPUR: మణిపుర్‌లో మళ్లీ హింసాకాండ
మణిపుర్‌లోని మోరె జిల్లాలో కాల్పులు... 30 ఇళ్లు, దుకాణాలు తగులబెట్టిన అల్లరి మూకలు.. పరిస్థితి అదుపులోకి తెచ్చిన భద్రతా బలగాలు

ఈశాన్య రాష్ట్రం మణిపుర్‌‍(Manipur‌) రావణ కాష్టంలా మండుతూనే ఉంది. మణిపుర్‌లో మళ్లీ హింసాకాండ చెలరేగింది. కాల్పులు, టియర్‌ గ్యాస్‌ ప్రయోగంతో మోరె(Moreh) జిల్లా దద్దరిల్లింది. దాడి ప్రతిదాడులతో రణరంగాన్ని( war zone ) తలపించింది. ఇంఫాల్‌కు 120కిలోమీటర్ల దూరం ఉన్న మోరె జిల్లాలో అల్లరిమూక దాదాపుగా 30 ఇళ్లు, దుకాణాలు(30 houses and shops) తగులబెట్టింది. అటవీ శాఖకు చెందిన అతిథి గృహం(guest house belonging to the forest department ) కూడా పాక్షికంగా దెబ్బతింది. మయన్మార్‌ సరిహద్దుల్లోని మోరే బజార్‌ ప్రాంతంలో ఈ దాడులు జరిగాయి.


భద్రతా దళాలు(security forces) గుంపును చెదరగొట్టడానికి ప్రయత్నించాయి. ఎంతకీ అల్లరి మూకలు వెనక్కి తగ్గకపోవడంతో అదుపు చేయడానికి భద్రతా దళాలు కాల్పులు(gunfight) జరిపాయి. ఈ కాల్పుల్లో కొంతమందికి బుల్లెట్‌ గాయలైనట్లు తెలుస్తోంది. కంగ్‌పోక్పి జిల్లాలో భద్రతా దళాలను తరలించడానికి ఉంచిన బస్సులకి కూడా దుండగులు నిప్పు పెట్టినట్టుగా అధికారులు తెలిపారు.

సపోర్మినాలో మణిపూర్‌ రిజిస్ట్రేషన్‌ కలిగిన బస్సుల్ని స్థానికులు ఆపేసి ఇతర సామాజిక వర్గానికి చెందిన వారు ఎవరైనా ఉన్నారని తనిఖీ చేశారు. ఆ తర్వాత కొందరు ఆ బస్సుల్ని తగులబెట్టారు. మరోవైపు హింసాకాండలో ఇళ్లు కోల్పోయి సహాయ శిబిరాల్లో ఉంటున్న వారి కోసం తాత్కాలిక ఇళ్ల నిర్మాణం పూర్తి కావస్తోందని ముఖ్యమంత్రి ఎన్‌. బైరన్‌ సింగ్‌(CM N Biren Singh ) చెప్పారు. ఇంఫాల్‌లోని సజీవా, తౌబల్‌ జిల్లాలోని యతిబి లౌకోల్‌లో ఇళ్లను నిర్మిస్తున్నారు. త్వరలోనే సహాయ శిబిరంలో ఉన్న వారందరినీ ఈ ఇళ్లకు తరలిస్తామని బైరన్‌ సింగ్‌ ట్వీట్‌ చేశారు.


ఇంఫాల్‌లో జరిగిన కార్గిల్ విజయ్ దివస్ కార్యక్రమంలో ప్రజలనుద్దేశించి ప్రసంగించిన బీరెన్ సింగ్, మణిపుర్‌లో శాంతియుత సహజీవనానికి భంగం కలిగించే అంశాలే ప్రస్తుత పరిస్థితులకు కారణమని ఆరోపించారు. తమ ప్రభుత్వం మాదక ద్రవ్యాల వ్యాపారులపై కఠినంగా వ్యవహరించడంతోనే కష్టాలు మొదలయ్యాయని, రాష్ట్రాన్ని విడగొట్టే లక్ష్యంతో చేస్తున్న విధ్వంసానికి, బెదిరింపులకు భయపడబోమని తేల్చి చెప్పారు. హింస మానుకుని, అన్ని వర్గాలకు శాంతిని పునరుద్ధరించడానికి ప్రభుత్వానికి సహాయం చేయాలని సీఎం ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


మంగళవారం కూడా హేకోల్, ఫౌగాక్చావో ఇఖాయ్ ప్రాంతాల్లో దుండగులు కాల్పులకు తెగబడ్డారు. ఈ కాల్పుల్లో ముగ్గురు పౌరులు గాయపడగా, భద్రతా బలగాలు ఎదురుకాల్పులు జరిపి పరిస్థితిని అదుపులోకి తెచ్చాయి. కాంగ్‌పోక్పి జిల్లాలో రెండు బస్సులను దగ్ధం చేసిన ఘటనలో ఒక యువకుడితో సహా తొమ్మిది మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Tags

Next Story