Delhi CM : ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు

Delhi CM : ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై దాడి.. పోలీసుల విచారణలో సంచలన విషయాలు
X

దేశ రాజధాని ఢిల్లీ సీఎం రేఖా గుప్తాపై ఇటీవల జరిగిన దాడి ఘటనలో పోలీసులు కీలక విషయాలను వెల్లడించారు. ఈ దాడిలో ప్రధాన నిందితుడు సకారియా రాజేశ్‌భాయ్ ఖిమ్జీభాయ్‌ ను విచారించగా, అతను ముఖ్యమంత్రిని కత్తితో పొడవాలని పథకం వేసుకున్నట్లు తేలింది. అయితే సీఎం కార్యాలయం వద్ద భారీ భద్రత ఉండటంతో తన ప్రణాళికను విరమించుకున్నానని సకారియా అంగీకరించాడు.

‘‘ఢిల్లీలో వీధి కుక్కల సమస్యను పరిష్కరించాలని నేను చాలాసార్లు కోరాను. దీనిపై ముఖ్యమంత్రి పట్టించుకోకపోవడంతో ఆమెపై దాడి చేయాలని నిర్ణయించుకున్నా. సీఎం నివాసానికి వెళ్లే ముందు సుప్రీంకోర్టుకు వెళ్ళాను. అక్కడ భద్రత ఎక్కువగా ఉండటంతో వెనక్కి వచ్చేశాను. తర్వాత సివిల్ లైన్స్‌లోని సీఎం కార్యాలయానికి వెళ్లాను. మొదట ఆమెను కత్తితో పొడవాలని ప్లాన్ చేసుకున్నాను. కానీ, భద్రత ఎక్కువగా ఉండటంతో కత్తిని బయటే పడేశాను" అని నిందితుడు చెప్పినట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.

ఘటన వివరాలు

ఈ దాడి ఆగస్టు 20న ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయంలో జరిగిన 'జన్ సున్వాయ్' కార్యక్రమంలో చోటుచేసుకుంది. ఫిర్యాదుదారుగా వచ్చిన సకారియా, పత్రాలు అందిస్తున్నట్లు నటించి ఒక్కసారిగా ముఖ్యమంత్రిపై దాడికి తెగబడ్డాడు. అతను పెద్దగా కేకలు వేస్తూ ఆమెను చెంపదెబ్బ కొట్టాడు, వెనక్కి తోసేయడానికి ప్రయత్నించాడు. అంతేకాకుండా ఆమె జుట్టును గట్టిగా పట్టుకున్నాడు. వెంటనే భద్రతా సిబ్బంది అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఈ దాడిలో ముఖ్యమంత్రి తల, భుజం, చేతులకు గాయాలయ్యాయి.

మరో నిందితుడి అరెస్ట్

ఈ ఘటనలో ప్రధాన నిందితుడికి సహకరించిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం నాడు అరెస్టయిన తహసీన్ సయ్యద్, సకారియాకు స్నేహితుడని పోలీసులు గుర్తించారు. సయ్యద్ దాడి కోసం సకారియాకు కొంత డబ్బు పంపించాడని, దాడికి ముందు సీఎం నివాసానికి సంబంధించిన వీడియోలను సకారియా సయ్యద్‌కు పంపించాడని పోలీసులు తెలిపారు. ఈ కేసుపై దర్యాప్తు కొనసాగుతోంది.

Tags

Next Story