RSS : ఆర్ఎస్ఎస్‌పై నిషేధం ఎత్తివేత

కేంద్రంలోని ఎన్డీయే ప్రభుత్వం మరో సంచలన నిర్ణయం తీసుకుంది. ఆరెస్సెస్ కార్యకలాపాల్లో ప్రభుత్వ ఉద్యోగులు పాల్గొనటాన్ని నిషేధిస్తున్న ఉత్తర్వులను ఎత్తివేసింది. దీంతో ఇకపై ప్రభుత్వ ఉద్యోగులు నిరాటంకంగా సంఘ్ కార్యక్రమాల్లో పాలుపంచుకునేందుకు మార్గం సుగమం చేసింది. ఈ మేరకు సిబ్బంది వ్యవహారాల శాఖ ఒక ఉత్తర్వు వెలువరించింది.
జూలై 9వ తేదీతో ఉన్న ఈ ఉత్తర్వులు దేశంలో రాజకీయంగా తీవ్ర సంచలనం రేపుతున్నాయి. 58 ఏళ్ల క్రితం విధించిన రాజ్యాంగేతర ఉత్తర్వును మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం ఉపసంహరించిందని బీజేపీ నేత అమిత్ మాలవీయ ఎక్స్ లో ధృవీకరించారు. గోవధకు వ్యతరేకంగా 1966 నవంబర్ 7న పార్లమెంటు వద్ద పెద్ద ఎత్తున ఆందోళన జరిగిందని, ఆరెస్సెస్, జనసంఘ్ అప్పట్లో
లక్షల మందిని సమీకరించడంతో వణికిపోయిన అప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వం ప్రభుత్వ సిబ్బంది ఆరెస్సెస్ లో చేరడాన్ని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారని ఆయన పేర్కొన్నారు. ఇటీవలి కాలంలో ఆరెస్సెస్ నాయకులు బీజేపీ నాయకుల వ్యవహార శైలిపై సూటిగానే పరోక్ష వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ పనితీరుతో మాతృసంస్థ సంతృప్తిగా లేదనే అభిప్రాయాల ఉన్న నేపథ్యంలో సంఘ్ నేతలను ప్రసన్నం చేసుకునేందుకే ఈ ఉత్తర్వులు ఎత్తివేశారన్న వాదనలు వినిపిస్తున్నాయి.
నిషేధం ఎత్తివేతపై దేశవ్యాప్తంగా వివిధ వర్గాల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ఆరెస్సెస్ స్థాపించి 2025 నాటికి వందేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో మోదీ ప్రభుత్వం ఇప్పుడే సంబురాలు ప్రారంభించిందని అంటున్నారు పలువురు ప్రముఖ రచయితలు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com