Bangladesh: భారత టీవీ ఛానళ్లపై నిషేధం విధించండి.. బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌

Bangladesh: భారత టీవీ ఛానళ్లపై నిషేధం విధించండి.. బంగ్లాదేశ్‌ హైకోర్టులో పిటిషన్‌
X
రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందన్న పిటిషనర్

బంగ్లాదేశ్ లో హిందువులు, మైనార్టీలపై దాడులు జరుగుతుండటంతో అక్కడ ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత్ కు చెందిన టీవీ ఛానళ్లపై నిషేధం విధించాలని కోరుతూ అక్కడి హైకోర్టులో పిటిషన్ దాఖలయింది. బంగ్లాదేశ్ లోని సుప్రీంకోర్టు న్యాయవాది ఈ పిటిషన్ వేశారు.

బంగ్లాదేశ్ కు వ్యతిరేకంగా భారత టీవీ ఛానళ్లు ప్రచారం చేస్తున్నాయని పిటిషన్ లో ఆయన పేర్కొన్నారు. ఈ దుష్ప్రచారం వల్ల రెండు దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దీనివల్ల బంగ్లాదేశ్ సార్వభౌమత్వానికి ముప్పు వాటిల్లుతుందని చెప్పారు. ఈ పిటిషన్ పై బంగ్లాదేశ్ హైకోర్టు వచ్చే వారం విచారణ జరపనున్నట్టు తెలుస్తోంది.

బంగ్లాదేశ్‌లో జరిగిన ఓ ర్యాలీలో ఇస్కాన్‌ ప్రచారకర్త చిన్మయ్‌ కృష్ణదాస్‌ పాల్గొన్నారు. ఆ సమయంలో బంగ్లాదేశ్‌ జెండాను అగౌరవపరిచారనే ఆరోపణలపై చిన్మయ్‌ కృష్ణదాస్‌ను ఢాకా పోలీసులు అరెస్టు చేయడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈ అరెస్టును వ్యతిరేకిస్తూ అక్కడి హిందువులు పెద్దఎత్తున నిరసనలు చేపట్టారు. ఈ నిరసనల్లో ఓ న్యాయవాది మరణించడంతో ఇస్కాన్‌ (ISKCON)ను నిషేధించాలని ఓ న్యాయవాది వేసిన పిటిషన్‌ను బంగ్లాదేశ్‌ (Bangladesh)లోని ఢాకా హైకోర్టు కొట్టివేసింది. అయితే, దేశంలో ఇస్కాన్‌ కార్యకలాపాలపై ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుందో నివేదిక ఇవ్వాలని అటార్నీ జనరల్‌కు ఆదేశాలు ఇచ్చినట్లు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి.

మరోవైపు బంగ్లాదేశ్‌లోని చటోగ్రామ్‌లో కొందరు ఆందోళనకారులు హిందూ వ్యతిరేక నినాదాలు చేస్తూ మూడు దేవాలయాలపై దాడికి పాల్పడ్డారు. ఈ తరహా ఘటనలపై స్పందించిన భారత్‌.. దేశంలోని అల్పసంఖ్యాకులను రక్షిస్తామని తాత్కాలిక ప్రభుత్వం గతంలో చేసిన వాగ్దానాన్ని నిలబెట్టుకోవాలని డిమాండ్‌ చేసింది. మైనారిటీలు సహా పౌరుల ప్రాణాలను, స్వేచ్ఛను కాపాడే బాధ్యత ఢాకాదేనని పేర్కొంది.

Tags

Next Story