Bank Holidays : బ్యాంకులకు వెళ్తున్నారా? ఫిబ్రవరి సెలవుల లిస్ట్ వచ్చేసింది.. ఓ లుక్కేయండి!

Bank Holidays :ఫిబ్రవరి నెల వచ్చేస్తోంది. ఏడాదిలో అన్నింటికంటే తక్కువ రోజులు ఉండే నెల ఇదే అయినా, సెలవులు మాత్రం బాగానే ఉన్నాయి. మీరు ఈ నెలలో బ్యాంకు పనులేవైనా ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఓ లుక్కేయండి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన తాజా జాబితా ప్రకారం.. ఫిబ్రవరిలో ఏయే రోజుల్లో బ్యాంకులు మూతపడనున్నాయో తెలుసుకుంటే, చివరి నిమిషంలో ఇబ్బంది పడకుండా ఉండొచ్చు. ముఖ్యంగా పండుగలు, రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల నేపథ్యంలో కొన్ని రాష్ట్రాల్లో అదనపు సెలవులు ఉండనున్నాయి.
సాధారణంగా ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం, ప్రతి నెల రెండో, నాలుగో శనివారాలతో పాటు అన్ని ఆదివారాల్లో బ్యాంకులు మూతపడతాయి. 2026 ఫిబ్రవరి నెలలో ఫిబ్రవరి 1, 8, 15, 22 తేదీల్లో నాలుగు ఆదివారాలు వచ్చాయి. అలాగే ఫిబ్రవరి 14 (రెండో శనివారం), ఫిబ్రవరి 28 (నాలుగో శనివారం) బ్యాంకులకు సెలవు దినాలు. ఇవి కాకుండా వివిధ రాష్ట్రాల్లో జరుపుకునే పండుగలు, చారిత్రక ప్రాధాన్యత ఉన్న రోజులను బట్టి మరికొన్ని అదనపు సెలవులు ఉన్నాయి. వీటిని గమనించి మీ ఆర్థిక లావాదేవీలను ప్లాన్ చేసుకోవడం ఉత్తమం.
ముఖ్యంగా ఫిబ్రవరి 18వ తేదీన సిక్కింలో లోసార్ పండుగ (టిబెటన్ నూతన సంవత్సరం) ఘనంగా జరుపుకుంటారు. ఆ రోజున సిక్కిం రాష్ట్రవ్యాప్తంగా బ్యాంకులు పనిచేయవు. అలాగే, ఫిబ్రవరి 19న మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు జరుపుకుంటారు. మరాఠా వీరుడి పుట్టినరోజు పురస్కరించుకుని మహారాష్ట్ర ప్రభుత్వం ఆ రోజును బహిరంగ సెలవుగా ప్రకటించింది, కాబట్టి అక్కడ బ్యాంకులు మూతపడతాయి.
అదేవిధంగా ఫిబ్రవరి 20వ తేదీన మిజోరం, అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల్లో రాష్ట్ర అవతరణ దినోత్సవం నిర్వహిస్తారు. 1987లో ఇదే రోజున ఈ రెండు ప్రాంతాలు కేంద్రపాలిత ప్రాంతాల స్థాయి నుంచి పూర్తిస్థాయి రాష్ట్రాలుగా అవతరించాయి. ఈ చారిత్రక సందర్భాన్ని పురస్కరించుకుని ఈ రెండు రాష్ట్రాల్లో ఆ రోజున బ్యాంకులకు సెలవు ఉంటుంది. కాబట్టి ఆయా రాష్ట్రాల్లో ఉండేవారు ముందే అప్రమత్తమవ్వడం మంచిది.
బ్యాంకులు సెలవులో ఉన్నప్పటికీ, ఖాతాదారులకు డిజిటల్ సేవలు ఎప్పుడూ అందుబాటులో ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్ బ్యాంకింగ్, యూపీఐ ద్వారా డబ్బులు పంపడం లేదా స్వీకరించడం వంటి పనులు యథావిధిగా చేసుకోవచ్చు. అలాగే ఏటీఎంలు కూడా పనిచేస్తాయి. చెక్కుల చెల్లింపులు, పెద్ద మొత్తంలో నగదు విత్ డ్రా వంటి పనులు మాత్రమే సెలవు రోజుల్లో సాధ్యం కావు కాబట్టి, అలాంటి పనులను సెలవులకు ముందే పూర్తి చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
