Bank Holidays : మార్చిలో బ్యాంకులకు సెలవుల జాతర.. ఏకంగా 11 రోజులు మూతపడనున్న బ్రాంచ్‌లు.

Bank Holidays : మార్చిలో బ్యాంకులకు సెలవుల జాతర.. ఏకంగా 11 రోజులు మూతపడనున్న బ్రాంచ్‌లు.
X

Bank Holidays : మార్చి నెల వచ్చిందంటే చాలు.. అందరికీ హోలీ రంగులు, ఉగాది పచ్చడి గుర్తుకొస్తాయి. కానీ బ్యాంకు పనులు ఉన్నవారికి మాత్రం సెలవుల లెక్కలు గుర్తుకురావాలి. 2026 మార్చి నెలలో బ్యాంకులకు భారీగా సెలవులు రాబోతున్నాయి. పండుగలు, వారాంతపు సెలవులు అన్నీ కలిపి ఈ నెలలో దాదాపు 11 రోజుల పాటు బ్యాంకులు మూతపడనున్నాయి. కాబట్టి నగదు విత్‌డ్రా చేయాలన్నా, ముఖ్యమైన బ్యాంకు పనులు పూర్తి చేయాలన్నా ఇప్పుడే ఒక ప్లాన్ సిద్ధం చేసుకోవడం మంచిది. లేదంటే ఆఖరి నిమిషంలో ఇబ్బందులు పడక తప్పదు.

రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా విడుదల చేసిన క్యాలెండర్ ప్రకారం.. మార్చి నెలలో వరుసగా పండుగలు ఉన్నాయి. మార్చి 3న హోలీతో మొదలై.. 19న ఉగాది, ఆ వెంటనే 20 లేదా 21న రంజాన్ (చంద్రుడిని బట్టి), ఆ తర్వాత 27న శ్రీరామనవమి పండుగలు ఉన్నాయి. ఇవి కాకుండా సాధారణంగా వచ్చే ఆదివారాలు, రెండో, నాలుగో శనివారాలు ఎలాగూ ఉంటాయి. ముఖ్యంగా ఉగాది, రంజాన్ పండుగలు వారాంతానికి అటు ఇటుగా రావడంతో బ్యాంక్ ఉద్యోగులకు, కస్టమర్లకు లాంగ్ వీకెండ్స్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఈ సెలవులు రాష్ట్రాల వారీగా మారుతూ ఉంటాయని గమనించాలి.

సెలవుల వివరాలను ఒకసారి పరిశీలిస్తే.. మార్చి 1, 8, 15, 22, 29 తేదీల్లో ఆదివారాలు కావడంతో బ్యాంకులు పని చేయవు. అలాగే మార్చి 14న రెండో శనివారం, మార్చి 28న నాలుగో శనివారం సెలవు ఉంటుంది. వీటికి పండుగ సెలవులను కలిపితే మొత్తం 11 రోజులు బ్యాంక్ బ్రాంచ్‌లు పనిచేయవు. ముఖ్యంగా మార్చి నెలాఖరులో శ్రీరామనవమి, నాలుగో శనివారం, ఆదివారం వరుసగా రావడంతో వరుసగా మూడు రోజులు బ్యాంకులు క్లోజ్ అయి ఉంటాయి. ఆర్థిక సంవత్సరం ముగింపు సమయం కాబట్టి ఈ సెలవుల ప్రభావం వ్యాపారస్తులపై ఎక్కువగా ఉండే అవకాశం ఉంది.

బ్యాంకు బ్రాంచ్‌లు మూసి ఉన్నప్పటికీ, డిజిటల్ సేవలకు ఎలాంటి అంతరాయం ఉండదు. నెట్ బ్యాంకింగ్, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ లావాదేవీలు యథావిధిగా పనిచేస్తాయి. అత్యవసరంగా డబ్బులు కావాలంటే ఏటీఎంలు అందుబాటులో ఉంటాయి. అయితే చెక్కుల క్లియరెన్స్, డిమాండ్ డ్రాఫ్ట్‌ల జారీ, పెద్ద మొత్తంలో నగదు డిపాజిట్ చేయడం వంటి పనులు మాత్రం సెలవు రోజుల్లో సాధ్యం కాదు. అందుకే మీ ముఖ్యమైన ఆర్థిక లావాదేవీలను ఈ సెలవుల క్యాలెండర్‌ను దృష్టిలో ఉంచుకుని ముందే పూర్తి చేసుకోవడం ఉత్తమం.

Tags

Next Story