Bharat Jodo Yatra: మళ్లీ భారత్ జోడో యాత్ర

Bharat Jodo Yatra: మళ్లీ  భారత్ జోడో యాత్ర
గుజరాత్ నుంచి ప్రారంభించనున్న రాహుల్ గాంధీ

రెండో విడత ‘భారత్ జోడో యాత్ర’ కు రంగం సిద్ధమైంది. కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన మొదటి భారత్ జోడో యాత్ర సక్సెస్ కావడంతో రెండో విడత యాత్రకు శ్రీకారం చుట్టారు. రెండో విడతలో ఈ యాత్ర గుజరాత్ నుంచి ప్రారంభమై మేఘాలయ వరకు కొనసాగనుంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర కాంగ్రెస్ నేత నానా పటోలే వెల్లడించారు. అలాగే రెండో విడత భారత్ జోడో యాత్రకు సమాంతరంగా మహారాష్ట్రలో కాంగ్రెస్ పార్టీ పాద యాత్ర నిర్వహిస్తుందని ఆయన ప్రకటించారు.

రాహుల్ గాంధీ రెండో విడత భారత్ జోడో యాత్రను చేపట్టనున్నారన్న విషయాన్ని గతంలో ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జై రామ్ రమేశ్ అది గుజరాత్ లో మహాత్మా గాంధీ జన్మస్థలమైన పోర్ బందర్ నుంచి ప్రారంభమవుతుందని, అరుణాచల్ ప్రదేశ్ లోని పాసిఘాట్ తో ముగుస్తుందన్నారు. అయితే ఇప్పుడు ఆ యాత్ర రెండో ద‌శ మ‌హారాష్ట్ర నుంచి ఆరంభ‌మై మేఘాల‌యా వ‌ర‌కూ కొన‌సాగుతుంద‌ని మ‌హారాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ నానా ప‌టోలె విలేక‌రుల స‌మావేశంలో వెల్ల‌డించారు. అలాగే ఇక్కడి కాంగ్రెస్ పార్టీ నేత‌లు, శ్రేణులు రాహుల్ యాత్ర‌కు స‌మాంత‌రంగా మార్చ్ చేప‌డ‌తార‌ని చెప్పారు. ఇందుకోసం రాష్ట్రంలోని ప్రతి లోక్‌సభ స్థానానికి 48 మంది పార్టీ పరిశీలకులను నియమించారు. ఈ పరిశీలకులు ఆరు రోజుల్లోగా క్షేత్రస్థాయి పరిస్థితిపై నివేదికను సమర్పిస్తారు, ఆ తర్వాత ఆగస్టు 16న కోర్ కమిటీ సమావేశం జరగనుందని సమాచారం. అయితే రాహుల్ గాంధీ తన రెండో దశ యాత్రను తమ రాష్ట్రం నుంచి ప్రారంభించాల్సిందిగా ఆహ్వానించినట్లు గుజరాత్ కాంగ్రెస్ ప్రకటించిన ఒక రోజు తర్వాత ఇది జరిగింది.


తొలి విడత భారత్ జోడో యాత్ర గత ఏడాది సెప్టెంబర్ లో దక్షిణాది రాష్ట్రమైన తమిళనాడులోని కన్యాకుమారిలో ప్రారంభమైంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా మొత్తం 12 రాష్ట్రాలు, రెండు కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేస్తూ 130 రోజులు సాగింది. సుమారు 4 వేల కిలోమీటర్లకు పైగా ఈ పాదయాత్ర కొనసాగింది. చివరకు జమ్మూ కశ్మీర్ లోని శ్రీనగర్ లో ముగిసింది.

Tags

Read MoreRead Less
Next Story