Bharat Taxi : అమిత్ షా బంపర్ ఆఫర్..రూ.500 కడితే టాక్సీ డ్రైవరే ఆ కంపెనీకి ఓనర్!

Bharat Taxi : దేశవ్యాప్తంగా ఉన్న టాక్సీ డ్రైవర్ల జీవితాల్లో వెలుగులు నింపేలా కేంద్ర హోం, సహకార శాఖ మంత్రి అమిత్ షా ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. భారత్ టాక్సీ పేరుతో దేశంలోనే మొట్టమొదటి డ్రైవర్ల యాజమాన్యంలోని సహకార మొబిలిటీ ప్లాట్‌ఫారమ్‌ను ఆయన ప్రారంభించారు. సాధారణంగా ఓలా, ఉబర్ వంటి ప్రైవేట్ సంస్థల్లో డ్రైవర్లు కేవలం పనివారలగానే మిగిలిపోతారు, కానీ ఈ సరికొత్త వ్యవస్థలో డ్రైవర్లే యజమానులు. కేవలం రూ.500 చెల్లించి కంపెనీలో షేర్ కొనుగోలు చేయడం ద్వారా ఏ డ్రైవర్ అయినా భాగస్వామిగా మారవచ్చు. వీరిని గౌరవప్రదంగా సారథులు అని పిలుస్తారు. ఈ చొరవ వల్ల డ్రైవర్లకు ఆర్థిక భరోసా కలగడమే కాకుండా, కంపెనీ లాభాల్లో కూడా నేరుగా వాటా పొందే అవకాశం లభిస్తుంది.
ముఖ్యంగా మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ సారథి దీదీ అనే కాన్సెప్ట్‌ను ఈ పథకంలో ప్రవేశపెట్టారు. మహిళా డ్రైవర్లను ప్రోత్సహించడమే కాకుండా, మహిళా ప్రయాణీకుల భద్రతకు ఈ ప్లాట్‌ఫారమ్ అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది. ఎవరైనా ఒంటరి మహిళా ప్రయాణీకురాలు టాక్సీ బుక్ చేసుకున్నప్పుడు, సిస్టమ్ ఆటోమేటిక్‌గా మహిళా డ్రైవర్‌కే మొదటి ప్రాధాన్యత ఇస్తుంది. దీనివల్ల మహిళా డ్రైవర్లకు ఉపాధి పెరగడమే కాకుండా, మహిళా ప్రయాణీకులు ఎటువంటి భయం లేకుండా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు. ఇది సమాజంలో మహిళలు స్వయం ఉపాధితో రాణించేందుకు ఒక గొప్ప మార్గంగా నిలుస్తుంది.
ఈ భారత్ టాక్సీ వ్యవస్థను దేశంలోని ఐదు ప్రధాన సహకార సంస్థలను కలిపి ఏర్పాటు చేశారు. ఇందులో డ్రైవర్ల ప్రయోజనాల కోసం మేనేజ్‌మెంట్ బోర్డులో కూడా వారికి స్థానం కల్పించారు. బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల ఎన్నికల్లో కొన్ని సీట్లను డ్రైవర్ల కోసమే కేటాయించారు. దీనివల్ల డ్రైవర్లు తమ సమస్యలను తామే పరిష్కరించుకోవడమే కాకుండా, తమ హక్కుల కోసం పోరాడే అవకాశం ఉంటుంది. అంతేకాకుండా, ఇది ప్రభుత్వ గుర్తింపు పొందిన డిజిటల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌పై పనిచేస్తుంది. అంటే కస్టమర్ల నుంచి ఎటువంటి అదనపు కమిషన్లు వసూలు చేయరు. డ్రైవర్లకు పూర్తి పారదర్శకమైన ఆదాయం లభిస్తుంది.
ఇక ఆదాయం పంపకం విషయానికి వస్తే.. ఇందులో చాలా ఆకర్షణీయమైన పద్ధతిని అనుసరిస్తున్నారు. భారత్ టాక్సీ సంపాదించే మొత్తం ఆదాయంలో 20 శాతం డ్రైవర్ల పేరిట పెట్టుబడిగా జమ చేస్తారు. మిగిలిన 80 శాతం ఆదాయాన్ని డ్రైవర్లు తిరిగిన దూరం ఆధారంగా వారికి చెల్లిస్తారు. మొదటి మూడు సంవత్సరాలు కంపెనీ విస్తరణ కోసం వెచ్చిస్తారు. ఆ తర్వాత వచ్చే లాభాల్లో 80 శాతం నేరుగా డ్రైవర్లకే పంచుతారు. ప్రైవేట్ సంస్థల దోపిడీకి అడ్డుకట్ట వేస్తూ, సామాన్య డ్రైవర్లను యజమానులుగా మార్చే ఈ భారత్ టాక్సీ భవిష్యత్తులో దేశ రవాణా రంగంలో పెను మార్పులు తీసుకురావడం ఖాయంగా కనిపిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
