Maharashtra: మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు

Maharashtra: మహారాష్ట్ర సీఎం ప్రమాణస్వీకారానికి ముహూర్తం ఖరారు
X
డిసెంబర్ 5న ఆజాద్ మైదానంలో సీఎం ప్రమాణ స్వీకారం ఉంటుందన్న నేత

మహారాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 5న కొలువుదీరే అవకాశముందని బీజేపీకి చెందిన సీనియర్ నేత ఒకరు చెప్పారు. ఈ మేరకు ఇంగ్లీష్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేసులో దేవేంద్ర ఫడ్నవీస్ ముందున్నట్లు అతను చెప్పినట్లుగా ఇంగ్లీష్ మీడియా వెల్లడించింది.

కొన్ని రోజుల కిందట కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మహాయుతి నేతలు భేటీ అయ్యారు. మరుసటి రోజు సీఎం అభ్యర్థిత్వంపై నిర్ణయం తీసుకోవడానికి దేవేంద్ర ఫడ్నవీస్, ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ సమావేశం కావాల్సి ఉండగా... షిండే హఠాత్తుగా తన స్వగ్రామానికి వెళ్లిపోయారు. దీంతో సమావేశం రద్దైంది.

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి ఆరు రోజులు కావొస్తున్నప్పటికీ బీజేపీ ఎమ్మెల్యేల సమావేశాన్ని నిర్వహించి... పార్టీ శాసనసభాపక్ష నేతను ఎన్నుకోలేదు. అయితే కొత్త సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమం డిసెంబర్ 5న ఆజాద్ మైదాన్‌లో నిర్వహించే అవకాశం ఉందని బీజేపీ, శివసేనకు చెందిన నేతలు చెప్పినట్లు 'ది హిందూ' పత్రిక వెల్లడించింది.

"బీజేపీ క్రమశిక్షణ కలిగిన పార్టీ. పార్టీ శాసనసభాపక్ష నేత, సీఎం అంశానికి సంబంధించి ఇద్దరు కేంద్ర పరిశీలకులను నియమిస్తుంది. ఈ పరిశీలకులు ముంబైకి వచ్చి ఎమ్మెల్యేలతో సమావేశమవుతారు. శాసనసభాపక్ష నాయకుడిని ఎన్నుకున్న తర్వాత మేం గవర్నర్‌ను కలుస్తాం" అని బీజేపీకి చెందిన సీనియర్ నేత ఒకరు చెప్పారు.


Tags

Next Story