Mamata Banerjee : బెంగాల్‌లో బీజేపీ బంద్.. సెక్యూరిటీ టైట్ చేసిన మమత

కోల్‌కతాలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటనపై ఆందోళనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆ ఘటనలో విచారణపై రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు నిరసనగా BJP బుధవారం 12 గంటల బెంగాల్ బంద్ కొనసాగుతోంది. మంగళవారం జరిగిన నబన్నా అభియాన్ ర్యాలీలో విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం పట్ల పార్టీ మండిపడుతూ ఈ బంద్ చేపట్టింది. దీంతో రాష్ట్రం స్తంభించింది.
పలుచోట్ల దుకాణాలను మూసివేస్తూ BJP శ్రేణులు ఆందోళన చేపట్టాయి. బంద్ కారణంగా బెంగాల్ లో పలు చోట్ల రవాణా వ్యవస్థకు ఆటంకం ఏర్పడింది. పట్టాలపై ఆందోళనకారులు నిరసనకు దిగడంతో రైళ్ల రాకపోకలకు అంతరాయం కలిగింది.
BJP ఆందోళనల నేపథ్యంలో పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. ఇప్పటికే ఇద్దరు BJP ఎమ్మెల్యేలు సహా పలువురు కార్యకర్తలను అరెస్టు చేశారు. ఆందోళనల నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా బస్సు డ్రైవర్లు హెల్మెట్లు ధరించి వాహనాలు నడుపుతున్నారు. మమతను కరడుగట్టిన నియంతగా బెంగాల్ బీజేపీ చీఫ్, కేంద్ర మంత్రి సుకాంత మజుందార్ అభివర్ణించారు. హత్యాచారానికి గురైన డాక్టర్ సోదరికి న్యాయం జరగాలన్న ప్రజల డిమాండ్‌తో 12గంటల బంద్‌కు పిలుపునిచ్చినట్లు తెలిపారు. న్యాయం కావాలంటూ ప్రజలు చేస్తున్న ఆక్రందనలు ఆమె చెవిటి సర్కారుకు విన్పించడం లేదని మండిపడ్డారు. అరాచక ప్రభుత్వ తీరును ఎండగట్టేందుకే బంద్‌కు పిలుపునిచ్చినట్టు తెలిపారు. మరోవైపు రాష్ట్రమంతటినీ స్తంభింపజేయడంతో పాటు సెప్టెంబర్ 6 దాకా పలు నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నట్టు విపక్ష నేత సువేందు అధికారి ప్రకటించారు. బీజేపీకి చెందిన నలుగురు విద్యార్థి నేతలను పోలీసులు మాయం చేశారని ఆయన ఆరోపించారు. వాళ్లను హత్యాయత్నం అభియోగాలపై అదుపులోకి తీసుకున్నట్టు చెప్పారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com