TG : రైతులను బీజేపీ మోసం చేసింది.. జైరాం రమేశ్‌ తీవ్ర విమర్శలు

TG : రైతులను బీజేపీ మోసం చేసింది.. జైరాం రమేశ్‌ తీవ్ర విమర్శలు
X

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు జైరాం రమేశ్‌ తీవ్ర విమర్శలు చేశారు. అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హరియాణాలో ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని మోదీపై ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. మోదీ సర్కార్‌పై హరియాణా ప్రజలు నమ్మకం కోల్పోయారని, మూడు వ్యవసాయ సాగుచట్టాల రద్దు తర్వాత కేంద్రం ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రైతుల జీవనంపై బీజేపీకి ఉన్న విజన్‌ను వివరించాలని ప్రధానిని డిమాండ్‌ చేశారు. ‘2021లో వ్యవసాయ సాగుచట్టాలు రద్దు చేసిన తర్వాత కేంద్రం రైతులకు ఇచ్చిన హామీలు ఎటు పోయాయి..? వారి డిమాండ్లు తీరుస్తామని ఎక్కడికి వెళ్లారు?. రైతులకు బీజేపీ ద్రోహం చేసింది. వారి గళాన్ని వినిపించేందుకు రైతులు మరోసారి వీధుల్లోకి రావాల్సివచ్చింది. వారిపై లాఠీచార్జ్‌ చేశారు. బాష్ఫవాయువులు ప్రయోగించారు. రైతుల సమస్యలను బీజేపీ ఎందుకు పట్టించుకోవడం లేదు?. వారి గౌరవప్రదమైన జీవనం, అభివృద్ధిపై బీజేపీకి ఉన్న విజన్‌ ఏంటి?’ అని జైరాం రమేశ్‌ ప్రశ్నించారు. కాంగ్రెస్‌ గెలిపిస్తే, కనీస మద్దతు ధరపై చట్టపరమైన హామీ ఇస్తుందని, రుణ మాఫీతో పాటు 30 రోజుల్లోగా పంట బీమా చెల్లిస్తుందని ఆయన చెప్పారు. ‘మహిళల భద్రతపై బీజేపీ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. హరియాణా కుమార్తెలు, మహిళా రెజ్లర్లపై తమ పార్టీ ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ వేధింపులకు పాల్పడ్డారు. ఆయనను శిక్షించడానికి బదులు అతడి కుమారుడికి టిక్కెట్‌ ఇచ్చింది. లైంగిక హింసకు పాల్పడే వారికి (బ్రిజ్‌ భూషణ్‌, ప్రజ్వల్‌ రేవణ్ణను ఉద్దేశిస్తూ) తమ పరివార్‌లో ఆశ్రయం కల్పిస్తున్నారు. ‘మోదీ కా పరివార్‌’లో నారీ శక్తి అనేది కేవలం నినాదానికి మాత్రమే పరిమితం. మోదీ పాలనలో మహిళలు సురక్షితంగా ఉన్నారా?’ అంటూ తీవ్రంగా విమర్శించారు.

Tags

Next Story