Jharkhand CM : ప్రతిపక్ష నేతలను వేటాడటంలో బీజేపీ దిట్ట : సీఎం హేమంత్ సోరెన్

ప్రతిపక్ష ఎమ్మెల్యేలు, ఎంపీలను వేటాడటంలో బీజేపీ దిట్ట అని ఝార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అన్నారు. అలా చేసి ఆ పార్టీ అనేక ప్రభుత్వాలను పడగొట్టిందని ఆరోపించారు. బిహార్ సీఎం నీతీశ్‌కుమార్‌ను ఎన్డీఏలో చేర్చుకోవడం దానికి ఉదాహరణగా పేర్కొన్నారు. రాష్ట్రాలపై జీఎస్‌టీ విధించి, వారికి ఆదాయ వనరులు లేకుండా చేసి.. పేద రాష్ట్రాల నడ్డి విరిచిందని ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఝార్ఖండ్ రాష్ట్రాన్ని బీజేపీ రెండు దశాబ్దాలకు సరిపడా పిండేసిందని అన్నారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకోవడానికి బీజేపీ పలు ప్రయత్నాలు చేసిందని, అవి బెడిసికొట్టడంతో తనపై కుట్ర పన్ని జైలుకు పంపించిందని సోరెన్ ఆరోపించారు. బీజేపీ చేసే ‘విభజన రాజకీయాలు’ రాష్ట్ర ప్రగతిని ఆపలేవని అన్నారు. హిందూ-ముస్లిం పోలరైజేషన్, మత విద్వేషాలు, విభజన రాజకీయాలు మినహా భాజపాకు మరో అజెండా లేదని సీఎం ఆగ్రహం వ్యక్తంచేశారు.ఒక గిరిజన సీఎం ఝార్ఖండ్ ముఖ్యమంత్రిగా ఉండడాన్ని బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని సోరెన్ మండిపడ్డారు. రాష్ట్రంలో నెలలతరబడి ఎన్నికల ప్రచారాలు చేస్తున్న సీఎంలు వారి రాష్ట్రాల పరిస్థితులను ఎందుకు పట్టించుకోవట్లేదు అని ఆయన ప్రశ్నించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com