BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ నజర్

BJP: లోక్‌సభ ఎన్నికలపై బీజేపీ నజర్
ప్రధాని మోదీ నివాసంలో నిన్న రాత్రి దాదాపు ఐదు గంటల పాటు మారథాన్‌ సమావేశం జరిగింది.

లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ సన్నద్ధమౌతోంది. అంతకుముందే జరుగుతున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అనుసరించాల్సి వ్యూహంపై కూడా బీజేపీ హైకమాండ్‌ మంతనాలు జరుపుతోంది. ప్రధాని మోదీ నివాసంలో నిన్న రాత్రి దాదాపు ఐదు గంటల పాటు మారథాన్‌ సమావేశం జరిగింది. ప్రధాని మోదీ, హోం శాఖ సహాయ మంత్రి అమిత్‌ షాతో పాటు పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, బీఎల్ సంతోష్‌ ఇతర పార్టీ కీలక నేతలు ఈ భేటీ పాల్గొన్నారు. ఈ సమావేశంలో ప్రధానంగా 2024 సార్వత్రిక ఎన్నికలపై చర్చించినట్లు తెలుస్తోంది. జాతీయ స్థాయిలో రాజకీయంగా వస్తున్న మార్పులను ఈ సమావేశంలో సమీక్షించినట్లు తెలుస్తోంది. కర్ణాటక ఎన్నికల్లో పరాజయం తరవాత త్వరలోనే జరుగుతున్న పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు అనుసరించాల్సి వ్యూహంపై కూడా ఈ సమావేశంలో మంతనాలు జరిపినట్లు సమాచారం.ఇదే సమయంలో పార్టీలో కూడా సంస్థాగత మార్పులు చేసే అంశాన్ని కూడా నిన్న రాత్రి సమావేశంలో చర్చించినట్లు జాతీయ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ సమావేశంపై పార్టీ అధికార ప్రకటన చేయకున్నా సార్వత్రిక ఎన్నికల్లో అనుసరించాల్సి వ్యూహంపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది.

కేంద్ర మంత్రివర్గంలోనూ భారీ మార్పులపై ఈ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. మరికొద్ది రోజుల్లో కేబినెట్‌ విస్తరణ ఉండొచ్చని తెలుస్తోంది.ఎన్నికలకు ముందు వ్యతిరేకత ఎదుర్కొంటున్న మంత్రులను తప్పించి కొత్తవారిని మంత్రివర్గంలోకి తీసుకునే అవకాశాలున్నట్లు ఊహాగానాలు విన్పిస్తున్నాయి. ఈ ఏడాది చివర్లో తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ఉన్నాయి. ఈ నాలుగింటిలో ఒక్క రాష్ట్రంలోనే బీజేపీ అధికారంలో ఉంది.వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలకు ముందు జరిగే ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా మెజార్టీ దక్కించుకోవాలని కాషాయ పార్టీ వ్యూహాలు రచిస్తోంది. ఈ నాలుగు రాష్ట్రాల నుంచి కొందర్ని మంత్రి వర్గంలోకి తీసుకునే అవకాశం ఉందన్న వార్తలు వస్తున్నాయి. దీనిపై తెలంగాణ బీజేపీలోనూ చర్చ జరుగుతోంది.

అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని మోదీ మధ్యప్రదేశ్‌ ఎన్నికల ప్రచారం ప్రారంభించారు.తొలిసారి ఎంపీ ఎన్నికల ప్రచారంలో ఉమ్మడి సివిల్‌ కోడ్‌ గురించి చర్చించారు. బీజేపీ మేనిఫెస్టోలో ఈ అంశం ఉన్నా ప్రచారంలో దీన్ని ప్రముఖంగా పేర్కొనడం ఇదే మొదటిసారి. మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌తో పాటు తెలంగాణ రాష్ట్రాల అంసెబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి సివిల్‌ కోడ్‌ను ప్రధాన ఎన్నికల అంశంగా బీజేపీ ప్రచారం చేసే అవకాశముంది. ఈ అంశంపై మధ్యప్రదేశ్‌లో ప్రధాని ప్రకటన తరవాత జనం నుంచి వస్తున్న ఫీడ్‌ బ్యాక్‌ను పార్టీ విశ్లేషిస్తోంది. మోదీ ప్రభుత్వం 9 ఏళ్ళు పూర్తి చేసుకున్న నేపథ్యంలో గత నెలలో జాతీయ స్థాయిలో పార్టీ నేతలు విస్తృత పర్యటనలు చేశారు. మోదీ ప్రభుత్వం పట్ల ప్రజల నుంచి విశేష స్పందన లభించినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.

Tags

Read MoreRead Less
Next Story