కొత్త మిత్రుల వేటలో ఎన్డీయే.. చర్చల్లో మోడీ, షా!!

hyderabad
కొత్త మిత్రుల వేటలో ఎన్డీయే.. చర్చల్లో మోడీ, షా!!
2024 సార్వత్రిక ఎన్నికల నాటికి ఎన్డీయేను బలోపేతం చేసే పనిలో బీజేపీ వుంది. జేడీఎస్, టీడీపీ వంటి పార్టీలోతో ఇప్పటికే చర్చలు జరుపుతోంది. తటస్తపార్టీలు కాంగ్రెస్ తో కలవకుండా జాగ్రత్తపడుతోంది.

2024 ఎన్నికలుక సిద్దమౌతున్న బీజేపీ.

మరోసారి అదికారంలోకి రావడం పై వ్యూహరచనలు.

ఎన్డీయే విస్త్రుతితో ప్రతిపక్షాల ఐక్యతారాగానికి ప్రతివ్యూహం.

నెలరోజులుగా పలు పార్టీల అధినేతలను కలుస్తున్న మోడీ, అమిత్‌షా

పాత మిత్రుడు చంద్రబాబుతో అమిత్, నడ్డా బేటీపై ఆసక్తి

ఎన్డీయేలో చేరేందుకు జేడీఎస్ సుముఖత.

ఇప్పటికే బీజేపీ సిట్టింగుల్లో 144 స్దానాల్లో వ్యతిరేక పవనాలు.


గడిచిన నెలరోజులుగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ దేశంలోని పలు పార్టీల అధ్యక్షలను కలుస్తున్నారు... కర్నాటక ఎన్నికల్లో బీజేపీ తీవ్ర వైఫల్యం చవిచూసిన తర్వాత జరుగుతున్న ఈ పరిణామం నిశితంగా పరిశీలించే ఏ విశ్లేషకుడైనా సరే 2024 సార్వత్రిక ఎన్నికలకు బీజేపీ భారీ మార్పుచేర్పులకు సిద్దమౌతోందని ఇట్టే చెప్పేస్తారు. 2014, 2019ల్లో వరుసగా రెండుసార్లు కేంద్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసి కాంగ్రెస్ తమ దరిదాపుల్లో కూడా లేదని చాటుకున్న కమలం పార్టీకి ఈసారి అదే వాతావరణం పునరావృతం కాదని మరొకరు చెప్పక్కర్లేదు. ఎన్నికల విషయంలో అత్యంత నిశిత పరిశీలన, పక్కా వ్యూహాలు పాటించే మోడీ-షాల ద్వయం అందుకు తగ్గట్టుగానే కసరత్తులు చేస్తేంది. ఉత్తరాదిన దాదాపు పూర్తి ఆదిపత్యాన్ని ప్రదర్శించిన తాము మూడోసారి అదే ఆధిపత్యం చాటడం సాధ్యం కాదు కనుకే ఈసారి ఎన్నికల్లో దక్షిణాది రాష్ట్రాలపై పూర్తి దృష్టిసారిస్తుందని అందరూ ఊహించిందే. కానీ కర్నాటక ఎన్నికల్లో అధికారాన్ని నిలబెట్టుకుని , తర్వాత తెలంగాణలో సత్తాచాటుకుందామనుకున్న కమలం పార్టీకి ఇప్పుడిప్పుడే వాస్తవం సాక్షాత్కారమౌతోంది. ఉత్తరాదిన పనిచేసిన వారి సంప్రదాయ అస్త్రాలు కర్నాటక, తెలంగాణలో పారవని తెలుసుకుంది. కాబట్టి 2024 ఎన్నికలు కాంగ్రెస్ లాంటి ప్రతిపక్షాలకు తమ ఉనికి చాటుకోవడం ఎంత ప్రధానమో.. తమ ఆధిపత్య పరంపరనుకొనసాగించాల్సిన అవసరం బీజేపీకీ అంతే కీలకం.



ఉత్తరాది ఆధిపత్యం తగ్గుముఖం.. స్వంత స్ధానాల్లోనే 144 చోట్ల వ్యతిరేక పవనాలు.

మరోవైపు ఉత్తరాది రాష్ట్రాల్లోనూ బీజేపీకి ఈసారి గతంలో వున్న అనుకూలతులు చాలావరకు ప్రతికూలతలుగా మారొచ్చు.. గత ఎన్నికల నాటికి ఎన్డీఏ మిత్రపక్షాలుగా వున్న అకాళీదళ్, శివసేన, జనతాదళ్ యునైటెడ్ వంటి పార్టీలు ఇప్పుడు ప్రతిక్షాలయ్యాయి. ఉనికిని చాటుకునేందుకు పాత వైరిపార్టీలన్నీ ఐక్యతారాగం పాడుతున్నాయి.. ఆయా పార్టీల బలాబలాలు ఎలావున్నా వారికి పట్టున్న సామాజిక వర్గాలు ఈసారి బీజేపీ వ్యతిరేకంగా ఓటు వేస్తే ఖచ్చితంగా యూపీ, బీహార్, మధ్యప్రదేష్, బెంగాల్ వంటి పెద్దరాష్ట్రాల్లో బీజేపీ గతంలోసాధించినన్ని ఓట్లు,సీట్లూ రాబట్టలేదు.

గత ఎన్నికల్లో బీజేపీ స్వంతంగా సాధించుకున్న 303 పార్లమెంటు స్ధానాల్లో ఇప్పిటికే పార్టీ బలహీన పడ్డ స్దానల సంఖ్య 113 నుంచి తాజాగా 144కి పెరిగిందని వారి అంతర్గత నివేదికే చెప్తోందట. అందుకే ఉన్న స్ధానాలు కాపాడుకోవాలన్నా.. కొత్త ప్రాంతాల్లో గెలవాలన్నా పదేళ్ల ప్రభుత్వ వ్యతిరేకత తర్వాత అది సాధ్యం కాదని బీజేపీ గ్రహిస్తోంది. అందుకే ఆపార్టీ ఓవైపు ఇల్లు చక్కదిద్దుకుంటూనే మరోవైపు కొత్త మిత్రులను సమీకరించుకునే పనిలోపడిందట.

పలు రాష్ట్రాల్లో నాయకత్వ మార్పుచేర్పులు, కీలక నేతలకు బాధ్యతలు.

2023 సం. ప్రధమార్ధంలో జరిగిన కర్నటక ఎన్నికల్లో ఎలాగూ ఎదురుదెబ్బ తగిలింది కాబట్టి ద్వితీయార్దంలో జరిగే 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిలకు ఇప్పుడు మరింత కీలకంగా మారాయి. రాజస్ధాన్, మధ్యప్రదేశ్, చత్తీస్ ఘడ్, తెలంగాణ, మిజోరాం రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. సార్వత్రిక ఎన్నికలకు దాదాపు సెమీ ఫైనల్స్ లా వుండే ఈ ఎన్నికల్లో పూర్తి ఆధిపత్యాన్ని చూపడం ద్వారా బీజేపీ ఎన్నికల మూడ్ సెట్ చేద్దామనుకుంటోంది. అందుకే ఆయా రాష్ట్రాల్లో పార్టీలో వున్న పలు సమస్యలు చక్కదిద్దేపనిలో పడింది. అవసరమైతే మధ్యప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పార్టీ ప్రక్షాళనకు సమాలోచనలు జరుపుతోంది. తెలంగాణలో అధికారంలోకి రావడం ద్వారా దక్షిణాదిన కూడా తాము బలంగా వున్నామనిచాటుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీకి తెలంగాణలో పార్టీ నాయకులు మధ్య పొడచూపుతున్న విభేదాలు తలనొప్పిగా మారాయి. ఈటెల రాజేందర్ లాంటి కేసీఆర్ వ్యతిరేక వర్గం పార్టీలోచేరినా వారిని సరైనరీతిలో వినియోగించుకోలేక పోవడం.. రాష్ట్ర స్ధాయి రాజకీయాల్లో అంతగా ప్రావీణ్యంలేని బండి సంజయ్ వంటి నాయకులు కేవలం మత ప్రాతిపదికే విజయాస్ద్రాలుగా చూడటం తెలంగాణలో చెల్లవని పలువురు సూచిస్తున్నారు. తద్వారా కర్నాటకలో లా మరోసారి ఆశాభంగం తప్పదని పార్టీ నాయకత్వం గ్రహించిదంటున్నారు ఢిల్లీ వర్గాలు. అందుకే అవసరమైతే రాష్ట్రపార్టీలో కీలక మార్పుచేర్పులు కూడా చేసేందుకు సిద్దమౌతోందట. కర్నాటకతో పాటు ఈ రాష్ట్రాల్లోనూ పార్టీలో నాయకత్వ పరంగా మార్పులు తప్పదంటున్నారు బీజేపీ వర్గాలు.



ఎన్డీయేలోకి జేడీఎస్, టీడీపీలు??.. తటస్దంగా బీజేడీ, వైసీపీ !!

పాత మిత్రులు పోతే కొత్త మిత్రులతో భర్తీకి యత్నం మోడీ అమిత్‌షాల ద్వయం చేస్తోంది.తద్వారా తగ్గిందనుకుంటున్న కూటమి బలం యాదాతధంగానే వుందనిచూపించుకునే యోచనలో ఉంది కమలం పార్టీ. తెలుగుదేశం పార్టీకి మా తలుపులు శాశ్వతంగా మూసుకుపోయాయని చెప్పిన అమిత్‌షా స్వయంగా టీడీపీ అధ్యక్షడు చంద్రబాబుతో సమావేశం కావడం, ఆ సమావేశంలో పార్టీ జాతీయ అధ్యక్షలు జేపీ నడ్డాకూడా పాలు పంచుకోవండం చూస్తే పరిణామాలు కొత్త సమీకరణాలకు సంకేతాలని ఎవరైనా ఇట్టే చెప్పేయొచ్చు. 2018కి పూర్వం ఎన్డీయేలో భాగస్వామిగా వున్న చంద్రబాబు పార్టీని తిరిగి చేర్చుకుంటే ఖచ్చితంగా అది జాతీయ స్ధాయిలో బీజేపీకి కలిసివచ్చే అశమే అంటున్నారు. ఏపీలో రోజురోజుకు పడిపోతున్న జగన్ గ్రాఫ్ ను కూడా పరిగనణలోకి తీసుకుంటే చంద్రబాబుతో స్నేహం భవిష్యత్ అవసరంగా కూడా బీజేపీ చూడొచ్చు. చంద్రబాబుకు జాతీయ స్ధాయిలో వున్న గుర్తింపు ఖచ్చితంగా ఎన్డీయే బలాన్ని మరింత పెద్దది చేసి చూపుకునేందుకు బీజేపీకి ఉపయోగపడుతుంది. ఇప్పటిదాకా తాము ఏమిచేసినా పూర్తి సహకారం అందిస్తున్న జగన్ పార్టీని కమలం నేతలు ఎలా దూరం పెడతారన్నదే ఆసక్తికర అంశం. పొరుగు రాష్ట్రం కర్నాటకలో మొన్నటి ఎన్నికల్లో తీవ్రంగా నష్టపోయిన కుమారస్వామి పార్టీ జేడీఎస్ కూడా ఎన్డీయేలో చేరేందుకు చాలా ఆసక్తిగా వుందట.. కోల్పోయిన ప్రాభవాన్ని తిరిగి దక్కించుకునేందుకు తమకు పట్టున్న మైసూరు , మాండ్య ప్రాంతాల్లో కనీసం 4 పార్లమెంటు స్దానాలిస్తే చాలన్న ధోరణిలో ఆపార్టీ ఉందట. ఒడిషా అధికార పార్టీ బిజూ జనతాదళ్ ని కూడా ఎన్డీఏలోకి ఆహ్వానించినా నవీన్ పట్నాయక్ మాత్రం ఎప్పటిలా ఒంటరిగానే వుంటానని స్పష్టం చేసినట్టు తెలుస్తోంది.దీంతో ఆ పార్టీ కాంగ్రెస్ తో మాత్రం కలవకుండా ఉండే మాకదే చాలన్న జాగ్రత్తలో వుంది బీజేపీ. మరోవైపు పంజాబ్ ఎన్నికల్ల ోఘోర పరాజయాాన్ని చవిచూసి తమ పట్టున్న ప్రాంతాల్లో కూడా ఆప్ పార్టీ పాగా వేయడంతో అక్కడి అకాలీదళ్ కూడా తిరిగి ఎన్డీయే గూటికి చేరే యోచనలో వుంది. కేంద్రంలో బలంగా వున్న బీజేపీతో స్నేహం స్ధానికంగా తిరిగి బలంపుంజుకునేందుకు దోహదపడుతోందని వారు భావిస్తున్నారు. ఇలా చూస్తే ప్రతిపక్షాల ఐక్యత పేరుతో కాంగ్రెస్ చేస్తున్న ప్రయత్నాలకు సమాధానంగా స్ధానికంగా కాంగ్రెస్ కు వైరి పక్షంగా చూసే పార్టీలను కలుపుకుపోవడం ద్వారా బీజేపీ కూడా ప్రతివ్యూహం సిద్దం చేసుకుంటోంది.


ఎలా చూసినా 2024 సార్వత్రిక ఎన్నికల్లో నరేంద్ర మోడీ మూడో సారి ప్రధాని పీఠం అదిష్టించాలంటే ఈ సారి స్వంత బలం మాత్రం సరిపోదు. పొత్తులు అవసరం అని గ్రహిస్తోంది బీజేపీ. అందునా ఉత్తరాది రాష్ట్రాల్లో కంటే కాంగ్రెస్ బలంగా వున్న దక్షిణ రాష్ట్రాలనుంచి మిత్రులను చేర్చుకుంటే అది తమ కూటమికి బలం, కాంగ్రెస్ కు బలహీనత అవుతుందన్న వ్యూహంలో వుంది కాషాయ పార్టీ.

Tags

Read MoreRead Less
Next Story