BJP MLA: శివసేన శిందే వర్గం నేతపై భాజపా ఎమ్మెల్యే కాల్పులు

మహారాష్ట్రలో శివసేన శిందే వర్గం నేత మహేశ్ గైక్వాడ్‌పై భాజపా ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్ కాల్పులు జరపడం కలకలం రేపింది. శుక్రవారం అర్ధరాత్రి ఉల్హాస్‌నగర్ హిల్‌లైన్ పోలీస్ స్టేషన్‌లో జరిగిన ఈ ఘటన పోలీసుల ఎదుటే చోటుచేసుకుంది. ఓ భూ వివాదానికి సంబంధించి ఇరు వర్గాల నేతలు పోలీసు స్టేషన్‌కు వెళ్లారు. అక్కడ మాటా మాటా పెరిగి చివరికి కాల్పుల వరకూ వెళ్లింది.
మహారాష్ట్రలో అధికారంలో ఉన్న శివసేన శిందే వర్గం-భాజపా వర్గం మధ్య అనూహ్య ఘటన జరిగింది. ఎంతో కాలంగా అపరిష్కృతంగా ఉన్న ఓ భూ వివాదానికి సంబంధించి ఉల్హాస్‌నగర్ హిల్‌లైన్ పోలీస్ స్టేషన్‌కు ఇరు వర్గాల నేతలు వెళ్లారు. తొలుత భాజపా ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్ కుమారుడు, శివసేన శిందే వర్గం నుంచి మహేశ్ గైక్వాడ్ సహా పలువురు నేతలు పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నారు. ఈ క్రమంలోనే అక్కడకు వచ్చిన భాజపా ఎమ్మెల్యే గణ్‌పత్ గైక్వాడ్ ఒక్కసారిగా కాల్పులకు పాల్పడ్డాడు. ఈ ఘటనలో మహేశ్ గైక్వాడ్‌తో పాటు మరో వ్యక్తి గాయపడ్డారు. క్షతగాత్రులను తొలుత ఠాణేలోని ఓ స్థానిక ఆస్పత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుంచి ఓ ప్రైవేటు ఆస్పత్రికి మార్చారు. :
ఘటన తర్వాత ఓ మీడియా సంస్థతో మాట్లాడిన గణ్‌పత్ గైక్వాడ్....కాల్పుల పట్ల తనకు పశ్చాత్తాపం లేదని చెప్పారు. తన కుమారుడిని తన కళ్లెదుటే పోలీసు స్టేషన్‌లో కొడుతుంటే తట్టుకోలేకనే కాల్పులు జరిపినట్టు తెలిపారు. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందేపై ఆయన తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. మహారాష్ట్రలో నేరస్థుల రాజ్యం ఏర్పరచడానికే శిందే యత్నిస్తున్నారని ఆరోపించారు. ఉద్దవ్ ఠాక్రేను వెన్నుపోటు పొడిచినట్టే.....భాజపాను కూడా వెన్నుపోటు పొడుస్తారని అన్నారు. ఏక్‌నాథ్ శిందే తన నుంచి కోట్లాది రూపాయల డబ్బును అప్పుగా తీసుకున్నారనీ..... ఆయన సీఎం పదవికి రాజీనామా చేయాలని ప్రధాని మోదీ, ఉప ముఖ్యమంత్రి ఫడణవీస్‌ను అభ్యర్థించారు. తాను చేసిన అభివృద్ధి పనులకు కల్యాణ్ ఎంపీ, సీఎం శిందే తనయుడు శ్రీకాంత్ క్రెడిట్ కొట్టేస్తున్నారని ఆరోపించారు. కాల్పుల అనంతరం గణ్‌పత్ గైక్వాడ్ నుంచి పోలీసులు తుపాకీని స్వాధీనం చేసుకున్నారు. ఆయనపై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గణ్‌పత్ గైక్వాడ్‌తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com