Himachal Pradesh: హిమాచల్‌ను ముంచెత్తిన వరదలు

Himachal Pradesh:  హిమాచల్‌ను ముంచెత్తిన వరదలు
X
కొట్టుకుపోయిన రెండు కుటుంబాలు.. 150 కి.మీ దూరంలో మృతదేహాలు

హిమాచల్‌ప్రదేశ్‌ను ఆకస్మిక వరదలు హడలెత్తించాయి. దీంతో మండి జిల్లాలో భారీగా ఆస్తి, ప్రాణ నష్టం జరిగింది. ఇప్పటి వరకు 91 మంది చనిపోయారు. ఇక కొండచరియలు విరిగిపడడంతో గ్రామాలకు గ్రామాలే దెబ్బతిన్నాయి. ఆకస్మాత్తుగా వరదలు సంభవించడంతో చాలా మంది ప్రవాహంలో కొట్టుకుపోయారు. ఇక పంగ్లుయెడ్ గ్రామంలో రెండు కుటుంబాలకు చెందిన తొమ్మిది మంది గల్లంతయ్యారు. వారికి సంబంధించిన నలుగురి మృతదేహాలు దాదాపు 150 కి.మీ. దూరంలో లభ్యమయ్యాయి. మరో ఐదుగురి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మృతదేహాలు చాలాదూరం కొట్టుకుపోతుండడంతో గుర్తించడం కష్టంగా మారింది. డీఎన్ఏ పరీక్షల ద్వారా మృతదేహాలను గుర్తిస్తామని అధికారులు పేర్కొన్నారు.

ఇక రాష్ట్ర వ్యాప్తంగా 207 రోడ్డు మార్గాలను మూసేశారు. పలు ప్రాంతాల్లో అంధకారం అలుముకుంది. వందల సంఖ్యలో ప్రజలు నిరాశ్రయులయ్యారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎన్డీఆర్‌ఎఫ్‌, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన బృందాలు, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ దళాలు సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి. ఇక రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో వాతావరణ శాఖ ఆరెంజ్‌ అలర్ట్‌ కొనసాగిస్తోంది. ఇక కొండచరియలు విరిగి పడే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

Tags

Next Story