Budget 2026 : చరిత్రలో తొలిసారి..ఫైనాన్స్ సెక్రటరీ లేకుండానే బడ్జెట్ లెక్కలు..మోదీ సర్కార్ కొత్త ప్రయోగం.

Budget 2026 : సాధారణంగా దేశ బడ్జెట్ అనగానే ఆర్థిక మంత్రి హడావుడి, ఆర్థిక శాఖ ఉన్నతాధికారుల హడావుడి కనిపిస్తుంది. కానీ ఈసారి బడ్జెట్ 2026-27 తయారీలో ఒక వింత పరిస్థితి నెలకొంది. స్వతంత్ర భారత చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఒక ఫైనాన్స్ సెక్రటరీ(ఆర్థిక శాఖ కార్యదర్శి) లేకుండానే దేశపు అతిపెద్ద ఆర్థిక పత్రం తయారవుతోంది. ఈ లోటు బడ్జెట్‌పై ఎలాంటి ప్రభావం చూపుతుంది? అసలు ఈ పనులు ఎలా జరుగుతున్నాయి? పూర్తి వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.
దేశ బడ్జెట్ రూపకల్పనలో ఫైనాన్స్ సెక్రటరీ పాత్ర అత్యంత కీలకం. ఆర్థిక మంత్రిత్వ శాఖలోని వివిధ విభాగాల మధ్య సమన్వయం సాధించడం, బడ్జెట్ అంచనాలను పర్యవేక్షించడం, అంతిమంగా ఆర్థిక నిర్ణయాలకు దిశా నిర్దేశం చేయడం ఇతని బాధ్యత. సింపుల్‌గా చెప్పాలంటే బడ్జెట్ యంత్రానికి ఇతడే ఆపరేటర్ లాంటివాడు. అయితే ప్రస్తుతం ఈ పదవి ఖాళీగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఫిబ్రవరి 1, 2026న బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఆ రోజు ఆదివారం అయినప్పటికీ సంప్రదాయం ప్రకారం బడ్జెట్ విడుదల కావచ్చు.
గతంలో అజయ్ సేథ్ ఈ పదవిలో ఉండేవారు. ఆయన జూన్ 30, 2025న పదవీ విరమణ చేశారు. ఆ తర్వాత ఆయనను ఐఆర్డీఏఐ ఛైర్మన్‌గా నియమించారు. అంతకుముందు తుహిన్ కాంత పాండే కూడా ఈ బాధ్యతలను నిర్వర్తించారు. కానీ అజయ్ సేథ్ వెళ్ళిన తర్వాత ప్రభుత్వం ఇప్పటివరకు కొత్త ఫైనాన్స్ సెక్రటరీని నియమించలేదు. బడ్జెట్ లాంటి అత్యంత కీలకమైన సమయంలో ఇంతటి పెద్ద పదవి ఖాళీగా ఉండటం ఆర్థిక వర్గాల్లో ఆశ్చర్యం కలిగిస్తోంది.
ఆర్థిక కార్యదర్శి లేకపోయినా బడ్జెట్ పనులు ఏమాత్రం కుంటుపడలేదని సమాచారం. ఆర్థిక వ్యవహారాల విభాగం, వ్యయ విభాగం, రెవెన్యూ విభాగం తమ స్వంత స్థాయిలో గణాంకాలను సేకరిస్తూ, ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే ఈసారి బడ్జెట్ బాధ్యత పూర్తిగా ఒక కొత్త టీమ్ భుజస్కంధాలపై ఉంది. ఇందులో అంతర్జాతీయ సంస్థల్లో పనిచేసిన అనుభవం ఉన్న సీనియర్ అధికారులు కూడా ఉన్నారు. ముఖ్యంగా పన్నుల విషయానికి వస్తే, ప్రత్యక్ష, పరోక్ష పన్నుల బోర్డులకు చెందిన అగ్రశ్రేణి అధికారులు కొత్త చట్టాలను అమలు చేయడంలో చురుకైన పాత్ర పోషిస్తున్నారు.
ఆర్థిక కార్యదర్శి లేకపోవడం వల్ల బడ్జెట్ నాణ్యతలో ఏవైనా తేడాలు వస్తాయా? అన్నది ఇప్పుడు అసలు ప్రశ్న. అయితే, ప్రభుత్వం మాత్రం బడ్జెట్ తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, అనుభవం గల అధికారులు తగినంత మంది ఉన్నారని, సమయానికే అన్ని పనులు పూర్తవుతాయని భరోసా ఇస్తోంది. ప్రభుత్వం ఏప్రిల్ 2026 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టాన్ని తీసుకురావాలని యోచిస్తున్న తరుణంలో ఈ బడ్జెట్ మరింత కీలకంగా మారింది. మరి ఈ కొత్త టీమ్ సామాన్యుడి కోసం ఎలాంటి మేజిక్ చేస్తుందో చూడాలి.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

