Budget 2026-27: పల్లెలకు మహర్దశ.. రైతులకు, గ్రామీణ ప్రజలకు మోదీ సర్కార్ బంపర్ ఆఫర్.

Budget 2026-27: కేంద్ర ప్రభుత్వం రాబోయే 2026-27 ఆర్థిక సంవత్సర బడ్జెట్‌లో గ్రామీణ ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించనుంది. నివేదికల ప్రకారం..ఈసారి గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు కేటాయింపులు గణనీయంగా పెరగనున్నాయి. ప్రస్తుతం ఉన్న రూ.1.88 లక్షల కోట్ల బడ్జెట్‌ను దాదాపు 10 నుంచి 15 శాతం పెంచి, డబుల్ డిజిట్ వృద్ధిని నమోదు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనివల్ల గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవ్వడమే కాకుండా, గ్రామాల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపడి కొత్త ఉపాధి అవకాశాలు లభిస్తాయి.
ఈ బడ్జెట్‌లో అత్యంత కీలకమైన మార్పు ఉపాధి హామీ పథకంలో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుత మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (MGNREGS) స్థానంలో VB-G RAM G(వికసిత్ భారత్ గ్యారెంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవిక మిషన్) అనే కొత్త పథకాన్ని ప్రవేశపెట్టే ప్రతిపాదన ఉంది. దీని కోసం సుమారు రూ.95,000 కోట్లు కేటాయించే అవకాశం ఉంది. ఇది అసంఘటిత రంగంలోని కూలీలకు మరింత మెరుగైన ఉపాధిని, స్థిరమైన ఆదాయాన్ని కల్పించడమే కాకుండా గ్రామాల్లో శాశ్వత ఆస్తుల నిర్మాణానికి తోడ్పడుతుంది.
గ్రామీణ గృహ నిర్మాణం, రహదారుల నిర్మాణానికి కూడా ఈ బడ్జెట్‌లో పెద్దపీట వేయనున్నారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన-గ్రామీణ (PMAY-G) కింద రాబోయే ఐదేళ్లలో 2 కోట్ల కొత్త ఇళ్లు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీనికోసం నిధుల కొరత లేకుండా భారీగా కేటాయింపులు చేయనున్నారు. అలాగే, ప్రధానమంత్రి గ్రామీణ సడక్ యోజన (PMGSY) నాలుగో దశ కోసం రూ.70,000 కోట్ల భారీ ప్యాకేజీని ప్రభుత్వం ఇప్పటికే ఆమోదించింది. ఈ బడ్జెట్‌లో ఆ నిధులను విడుదల చేసి, కుగ్రామాలకు సైతం తారు రోడ్ల సౌకర్యం కల్పించనున్నారు.
ఈ భారీ కేటాయింపుల వల్ల గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల కొనుగోలు శక్తి పెరుగుతుంది. ఫలితంగా ఎకానమీలో డిమాండ్ పెరిగి దేశ ఆర్థిక వృద్ధికి దోహదం చేస్తుంది. 2024లో లబ్ధిదారుల గుర్తింపు ప్రక్రియలో జరిగిన జాప్యం వల్ల ఇళ్ల నిర్మాణం కొంత నెమ్మదించినా, 2026 నాటికి పనులన్నీ వేగవంతం చేసేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోంది. మొత్తానికి ఈ బడ్జెట్ పల్లె ప్రజల జీవితాల్లో కొత్త వెలుగులు నింపేలా కనిపిస్తోంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
