Budget 2026 : పాత పన్ను విధానానికి మంగళం పాడనున్నారా? కేంద్రం ప్లాన్ ఇదే.

Budget 2026 : ఫిబ్రవరి 1, 2026న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్నారు. ఈ తరుణంలో సామాన్య ప్రజలు, ముఖ్యంగా ఉద్యోగస్తులందరి కళ్లు ఆదాయపు పన్ను మార్పులపైనే ఉన్నాయి. అయితే గత కొన్నాళ్లుగా పన్ను చెల్లింపుదారుల మెదడును తొలిచేస్తున్న ఒకే ఒక ప్రశ్న.. పాత పన్ను విధానం పూర్తిగా కనుమరుగవుతుందా? ప్రభుత్వం కొత్త దానికే మొగ్గు చూపుతుందా? అన్నదే. దీనిపై ఆర్థిక నిపుణులు పలు ఆసక్తికర విషయాలను వెల్లడిస్తున్నారు.
ప్రస్తుతం మన దేశంలో రెండు రకాల ఆదాయపు పన్ను విధానాలు అమల్లో ఉన్నాయి. ఒకటి పాతది, రెండోది కొత్తది. పాత పద్ధతిలో సెక్షన్ 80C కింద ఎల్ఐసీ, పీపీఎఫ్, అలాగే హెల్త్ ఇన్సూరెన్స్, ఇంటి అద్దె భత్యం వంటి వాటిపై మినహాయింపులు లభిస్తాయి. కానీ కొత్త పద్ధతిలో ఇవేమీ ఉండవు. బదులుగా తక్కువ పన్ను రేట్లు, ఎక్కువ ఆదాయ పరిమితి వరకు సున్నా పన్నుప్రయోజనం ఉంటుంది. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ప్రభుత్వం పన్నుల వ్యవస్థను సరళతరం చేసేందుకు పాత విధానాన్ని క్రమంగా పక్కన పెట్టాలని భావిస్తోంది.
ప్రభుత్వ ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది. పన్ను చెల్లింపుదారులు కాగితాల హడావిడి లేకుండా, సులభంగా తమ రిటర్న్స్‌ను దాఖలు చేయాలన్నదే కేంద్రం లక్ష్యం. అందుకే గడిచిన రెండు బడ్జెట్లలో కొత్త పన్ను విధానాన్ని అత్యంత ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. స్టాండర్డ్ డిడక్షన్, సెక్షన్ 87A కింద లభించే మినహాయింపులతో కలిపి, కొత్త విధానంలో దాదాపు రూ.12.75 లక్షల వార్షిక ఆదాయం వరకు ఒక్క రూపాయి కూడా పన్ను కట్టాల్సిన పని లేదు. అంటే నెలకు రూ.లక్ష పైచిలుకు సంపాదించే ఉద్యోగికి కూడా జీరో టాక్స్ బెనిఫిట్ అందుతోంది.
మరోవైపు, పాత పన్ను విధానాన్ని ఎంచుకునే వారి సంఖ్య క్రమంగా తగ్గుతోంది. గత ఏడాది (2024-25) అంచనాల ప్రకారం దాదాపు 72 శాతం మంది పన్ను చెల్లింపుదారులు కొత్త విధానాన్నే ఎంచుకున్నారు. దీంతో పాత పద్ధతిని వెంటనే రద్దు చేయకుండా, మరికొన్ని ఏళ్ల పాటు కొనసాగించి, ప్రజలే స్వచ్ఛందంగా దాని నుంచి తప్పుకునేలా చేయాలని ప్రభుత్వం స్కెచ్ వేసింది. హోమ్ లోన్ వడ్డీ రాయితీలు పొందే వారు, దీర్ఘకాలిక పెట్టుబడి పథకాల్లో ఉన్న వారు ఇబ్బంది పడకుండా ఈ ఫేజ్ వైజ్ ప్లాన్ అమలు చేస్తున్నారు.
ఆర్థిక నిపుణుల అభిప్రాయం ప్రకారం.. ఈ బడ్జెట్‌లో కొత్త పన్ను విధానంలో స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని మరింత పెంచే అవకాశం ఉంది. అలా జరిగితే పాత విధానంలో ఉన్న రాయితీల అవసరం ప్రజలకు ఉండదు. రెండు రకాల పద్ధతులు ఉండటం వల్ల గందరగోళం పెరుగుతోందని, అందుకే భవిష్యత్తులో ఒకే పన్ను విధానం వైపు అడుగులు పడే అవకాశం ఉంది. ఈ ఫిబ్రవరి 1న వెలువడే ప్రకటనలతో పాత పద్ధతి ఆయుష్షు ఎంత అనేది తేలిపోనుంది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
