Budget 2026 : రైలు ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. రూ.3000 టికెట్ ఇక రూ.1500కే?

Budget 2026 : ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్ 2026పై దేశవ్యాప్తంగా సామాన్యుడిలో భారీ ఆశలు ఉన్నాయి. ముఖ్యంగా రైల్వే ప్రయాణికులకు సంబంధించి ఒక సంచలన వార్త ఇప్పుడు హల్ చల్ చేస్తోంది. కరోనా కాలంలో నిలిపివేసిన సీనియర్ సిటిజన్ల రైల్వే టికెట్ రాయితీలను మళ్ళీ పునరుద్ధరించే దిశగా కేంద్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఈ బడ్జెట్‌లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ దీనిపై అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సమాచారం.
కోట్లాది మంది భారతీయ రైల్వే ప్రయాణికులు, ముఖ్యంగా సీనియర్ సిటిజన్లు ఎదురుచూస్తున్న క్షణం రానే వచ్చింది. 2020 మార్చిలో కరోనా మహమ్మారి కారణంతో నిలిపివేసిన సీనియర్ సిటిజన్ కన్సెషన్ (రాయితీ)ను ఈ బడ్జెట్‌లో మళ్లీ ప్రకటించే అవకాశం ఉందని ఢిల్లీ వర్గాల ద్వారా తెలుస్తోంది. రైల్వే శాఖ, ఆర్థిక శాఖ మధ్య ఈ విషయంపై ఇప్పటికే చర్చలు ముగిశాయని, సానుకూల నిర్ణయం వెలువడే అవకాశం ఉందని సమాచారం. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే వృద్ధులకు తీర్థయాత్రలు చేయడం లేదా సుదూర ప్రయాణాలు చేయడం మళ్లీ చౌకగా మారుతుంది.
గతంలో ఉన్న నిబంధనల ప్రకారం.. 58 ఏళ్లు దాటిన మహిళలకు టికెట్ ధరలో 50 శాతం రాయితీ లభించేది. అంటే ఏసీ ఫస్ట్ క్లాస్ టికెట్ ధర రూ.3,000 ఉంటే, వారు కేవలం రూ.1,500 చెల్లిస్తే సరిపోయేది. అలాగే 60 ఏళ్లు దాటిన పురుషులకు 40 శాతం రాయితీ ఉండేది. దీనివల్ల రూ.3,000 టికెట్ వారికి కేవలం రూ.1,800కే వచ్చేది. స్లీపర్ క్లాస్ నుంచి ఏసీ ఫస్ట్ క్లాస్ వరకు అన్ని విభాగాల్లోనూ ఈ రాయితీ వర్తించేది. ఇప్పుడు ఇదే విధానాన్ని మళ్లీ అమలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోంది.
కరోనా సమయంలో అనవసర ప్రయాణాలను తగ్గించడానికి, సోషల్ డిస్టెన్సింగ్ పాటించడానికి ప్రభుత్వం ఈ రాయితీలను తాత్కాలికంగా రద్దు చేసింది. అయితే లాక్ డౌన్ ముగిసి, రైళ్లు సాధారణ స్థితికి వచ్చినప్పటికీ ఈ సదుపాయం మాత్రం మళ్లీ మొదలు కాలేదు. దీనివల్ల గత కొన్నేళ్లుగా వృద్ధులు పూర్తి ధర చెల్లించి ప్రయాణించాల్సి వస్తోంది. ప్రస్తుతం రైల్వే ఆదాయం మెరుగ్గా ఉండటం, ఎన్నికల సమీపిస్తుండటం వంటి కారణాలతో ఈ రాయితీలను మళ్లీ తీసుకురావాలనే డిమాండ్ గట్టిగా వినిపిస్తోంది.
ఈ రాయితీ పొందడం కూడా చాలా సులభం. దీని కోసం ఎటువంటి ప్రత్యేక కార్డులు లేదా దరఖాస్తులు అవసరం లేదు. కేవలం టికెట్ బుక్ చేసేటప్పుడు ఐఆర్సీటీసీ వెబ్‌సైట్‌లో లేదా రైల్వే కౌంటర్ వద్ద వయసు వివరాలు ఇస్తే సరిపోతుంది. ఆధార్ కార్డు లేదా ఏదైనా ప్రభుత్వ గుర్తింపు కార్డు ద్వారా వయసు ధృవీకరణ జరిగితే, సిస్టమ్ ఆటోమేటిక్‌గా టికెట్ ధరను తగ్గించి చూపిస్తుంది. ఈ బడ్జెట్‌లో ఈ ప్రకటన వస్తే మాత్రం మధ్యతరగతి కుటుంబాల్లోని పెద్దలకు ఇది ఒక పెద్ద ఊరట అని చెప్పవచ్చు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
