Income Tax : 1961 నాటి చట్టానికి గుడ్ బై.. 2026 నుంచి అమల్లోకి రానున్న సరికొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్.

Income Tax : 1961 నాటి చట్టానికి గుడ్ బై.. 2026 నుంచి అమల్లోకి రానున్న సరికొత్త ఇన్కమ్ ట్యాక్స్ రూల్స్.
X

Income Tax : కేంద్ర బడ్జెట్ 2026 మధ్యతరగతి పన్ను చెల్లింపుదారులకు, వ్యాపారవేత్తలకు, షేర్ మార్కెట్ ఇన్వెస్టర్లకు కీలకమైన మార్పులను మోసుకొచ్చింది. పన్ను నిబంధనలను సరళతరం చేస్తూనే, కొన్ని రంగాలపై భారాన్ని పెంచిన ఈ కొత్త ప్రతిపాదనలు ఏప్రిల్ 1, 2026 నుంచి అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా 1961 నాటి పాత ఆదాయపు పన్ను చట్టం స్థానంలో, ఆధునిక ఆర్థిక వ్యవస్థకు అనుగుణంగా రూపొందించిన కొత్త ఆదాయపు పన్ను చట్టం, 2025 అమల్లోకి రాబోతోంది. అయితే పన్ను స్లాబులలో మాత్రం ఎలాంటి మార్పులు చేయకపోవడం సామాన్యులకు కొంత ఊరటనిచ్చే అంశం.

ఐటీఆర్ ఫైల్ చేసే గడువు విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. సాధారణంగా ఆడిట్ అవసరం లేని పన్ను చెల్లింపుదారులు ఐటీఆర్-3, ఐటీఆర్-4 దాఖలు చేయడానికి జూలై 31 వరకు సమయం ఉండేది. కానీ ఇప్పుడు ఈ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. అంటే పన్ను దాఖలుకు అదనంగా మరో నెల సమయం లభించినట్లయింది. అయితే ఐటీఆర్-1, ఐటీఆర్-2 దాఖలు చేసేవారికి మాత్రం పాత గడువు (జూలై 31) యథాతథంగా ఉంటుంది. అలాగే, రివైజ్డ్ రిటర్న్స్ దాఖలు చేసే గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పొడిగించారు, కానీ డిసెంబర్ దాటితే మాత్రం పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది.

స్టాక్ మార్కెట్‌లో ట్రేడింగ్ చేసే వారికి ఈ బడ్జెట్ కొంత చేదు వార్తనే మోసుకొచ్చింది. ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ విభాగంలో సెక్యూరిటీ లావాదేవీల పన్ను భారీగా పెరిగింది. ఫ్యూచర్స్‌పై ఎస్టీటీ 0.02% నుంచి 0.05%కి, ఆప్షన్స్‌పై 0.1% నుంచి 0.15%కి పెంచారు. ఇది ట్రేడర్ల లాభాలపై ప్రభావం చూపనుంది. అలాగే, కంపెనీలు తమ షేర్లను బైబ్యాక్ చేసినప్పుడు వచ్చే ఆదాయంపై ఇక నుంచి క్యాపిటల్ గెయిన్స్ పన్ను వర్తిస్తుంది. గతంలో దీనిని డివిడెండ్‌గా భావించేవారు. ప్రమోటర్లకు మాత్రం భిన్నమైన పన్ను రేట్లు (22% నుంచి 30%) వర్తిస్తాయని ప్రభుత్వం స్పష్టం చేసింది.

టిసిఎస్ రేట్ల విషయంలో ప్రభుత్వం సమూల మార్పులు చేసింది. విదేశాలకు డబ్బు పంపే ఎల్ఆర్ఎస్ లావాదేవీలపై ఇప్పటివరకు ఉన్న సంక్లిష్టమైన పన్ను రేట్లను (5% మరియు 20%) తొలగించి, అందరికీ సమానంగా 2% కి కుదించారు. ఇది విదేశీ విద్య మరియు వైద్యం కోసం డబ్బు పంపేవారికి గొప్ప ఊరట. మరోవైపు, మద్యం, పొగాకు, స్క్రాప్, ఖనిజాల విక్రయాలపై టిసిఎస్ రేట్లను 2 శాతానికి సవరించారు. డివిడెండ్ ఆదాయంపై వడ్డీ మినహాయింపులను రద్దు చేయడం వల్ల ఇకపై ఆ ఆదాయంపై పూర్తి స్థాయిలో పన్ను చెల్లించాల్సి ఉంటుంది.

Tags

Next Story