Budget 2026 : సామాన్యుడి సొంతింటి కల నెరవేరేనా? బడ్జెట్ నుంచి రియల్ ఎస్టేట్ ఆశిస్తున్న 5 మార్పులివే.

Budget 2026 : కేంద్ర బడ్జెట్ 2026కు రంగం సిద్ధమవుతున్న వేళ, రియల్ ఎస్టేట్ రంగం ప్రభుత్వం నుంచి భారీ ఊరటను ఆశిస్తోంది. గత కొన్నేళ్లుగా మౌలిక సదుపాయాల కల్పనపై కేంద్రం ప్రత్యేక దృష్టి సారించడంతో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది. అయితే, ప్రస్తుతం గృహాల విక్రయాలు మందగించడం, భూముల ధరలు పెరగడం వంటి సవాళ్ల నేపథ్యంలో, ఈ రంగానికి పూర్వవైభవం రావాలంటే బడ్జెట్‌లో కొన్ని కీలక నిర్ణయాలు తప్పనిసరని బిల్డర్లు, డెవలపర్లు కోరుతున్నారు.
బడ్జెట్ 2026లో రియల్ ఎస్టేట్ రంగానికి బూస్ట్ ఇచ్చేలా కీలక ప్రకటనలు వస్తాయని బెంగళూరుకు చెందిన మనా ప్రాజెక్ట్స్ సిఎండి కిశోర్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉద్యోగాల సృష్టి, ప్రణాళికాబద్ధమైన నగరీకరణ జరగాలంటే బడ్జెట్‌లో సమతుల్యత అవసరమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా నిర్మాణ దశలో ఉన్న ప్రాపర్టీలపై ప్రస్తుతం ఉన్న జీఎస్టీ శాతాన్ని తగ్గించాలని బిల్డర్లు కోరుతున్నారు. దీనివల్ల ఇళ్ల ధరలు తగ్గి, కొనుగోలుదారులపై భారం తగ్గుతుంది. అంతేకాకుండా, గృహ రుణాల వడ్డీపై ఇచ్చే పన్ను మినహాయింపు పరిమితిని పెంచాలని, తద్వారా మధ్యతరగతి ప్రజలు ఇల్లు కొనేందుకు ఉత్సాహం చూపిస్తారని విశ్లేషిస్తున్నారు.
ప్రస్తుతం మార్కెట్లో ఒక కోటి రూపాయల లోపు ఉన్న ఇళ్ల విక్రయాలు నెమ్మదించాయని విఎస్ రియల్టర్స్ సిఇఓ విజయ్ హర్ష్ పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ మార్కెట్ మందగిస్తున్నట్లు ప్రారంభ సంకేతాలు కనిపిస్తున్నాయని, దీనికి అడ్డుకట్ట వేయాలంటే ప్రభుత్వం గృహ కొనుగోలుదారులకు మరిన్ని పన్ను రాయితీలు ఇవ్వాలని ఆయన సూచించారు. అలాగే, ల్యాండ్ డెవలపర్లకు తక్కువ ధరకే భూమి లభించేలా నిబంధనలు సవరించాలని, ఇది ప్రాజెక్ట్ ఖర్చులను తగ్గించి సామాన్యులకు తక్కువ ధరకే గృహాలను అందించేందుకు దోహదపడుతుందని వివరించారు.
కేవలం మెట్రో నగరాలే కాకుండా, టైర్-2 నగరాలలో కూడా మౌలిక సదుపాయాల కల్పనపై ప్రభుత్వం పెట్టుబడులు పెట్టాలని రియల్ ఎస్టేట్ నిపుణులు కోరుతున్నారు. కొత్త వసతి కారిడార్ల ఏర్పాటు వల్ల పట్టణీకరణ వికేంద్రీకరణ జరుగుతుందని, ఫలితంగా నగరాలపై ఒత్తిడి తగ్గి అభివృద్ధి అన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందని భావిస్తున్నారు. ప్రాజెక్టులకు అనుమతులు మంజూరు చేసే ప్రక్రియను మరింత వేగవంతం చేసేందుకు సింగిల్ విండో సిస్టమ్ సమర్థవంతంగా అమలు చేయాలని, అలాగే ఎఫ్డీఐ నిబంధనల్లో స్పష్టత తీసుకురావాలని ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతోంది.
భారత ఆర్థిక వ్యవస్థలో రియల్ ఎస్టేట్ రంగం కీలక పాత్ర పోషిస్తోంది. ఈ రంగం పుంజుకుంటే సిమెంట్, స్టీల్ వంటి అనుబంధ పరిశ్రమలు కూడా లాభపడతాయి. కాబట్టి బడ్జెట్ 2026లో గృహ రుణాల వడ్డీపై సెక్షన్ 24(b) కింద మినహాయింపును రూ.2 లక్షల నుంచి రూ.5 లక్షలకు పెంచే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నిర్ణయాలు గనుక అమలులోకి వస్తే, దేశవ్యాప్తంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం మళ్లీ పరుగులు పెడుతుందని, సామాన్యుల సొంతింటి కల సులభంగా నెరవేరుతుందని ఆశిస్తున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
