Budget 2026: మాకు ఒక రూల్..ప్రభుత్వానికి మరో రూలా? పన్ను రీఫండ్ నిబంధనలపై మిడిల్ క్లాస్ ఫైర్.

Budget 2026: మాకు ఒక రూల్..ప్రభుత్వానికి మరో రూలా? పన్ను రీఫండ్ నిబంధనలపై మిడిల్ క్లాస్ ఫైర్.
X

Budget 2026: కేంద్ర బడ్జెట్ 2026 దగ్గరపడుతున్న వేళ, దేశంలోని మిడిల్ క్లాస్ ట్యాక్స్ పేయర్స్ కేంద్ర ప్రభుత్వంపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆదాయపు పన్ను రీఫండ్ విషయంలో అమలవుతున్న ద్వంద్వ ప్రమాణాలపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. "మేం పన్ను కట్టడం ఆలస్యమైతే భారీ జరిమానా వేస్తారు కదా.. మరి మా డబ్బును రీఫండ్ ఇవ్వడంలో ప్రభుత్వం ఆలస్యం చేస్తే మాకేంటి నష్టపరిహారం?" అని సామాన్యుడు ప్రశ్నిస్తున్నాడు. బడ్జెట్ 2026కు కౌంట్ డౌన్ మొదలైన తరుణంలో సుమారు 50 లక్షల మంది పన్ను చెల్లింపుదారులు తమ రీఫండ్ కోసం కళ్ళల్లో వత్తులు వేసుకుని ఎదురుచూస్తున్నారు. ఆదాయపు పన్ను శాఖ రీఫండ్ ప్రక్రియలో జరుగుతున్న జాప్యం చిన్న వ్యాపారులను, మధ్యతరగతి కుటుంబాలను ఇబ్బందులకు గురిచేస్తోంది. ప్రభుత్వం చెబుతున్న దాని ప్రకారం.. మోసపూరిత రీఫండ్ క్లెయిమ్‌లను అడ్డుకోవడానికి తనిఖీలు కఠినతరం చేయడం వల్ల ఈ ఆలస్యం జరుగుతోందట. అయితే, ఈ తనిఖీల పేరుతో నెలల తరబడి సామాన్యుడి సొమ్మును ప్రభుత్వం తన దగ్గరే ఉంచుకోవడం ఎంతవరకు సమంజసం అన్నది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.

ఈ వివాదానికి ప్రధాన కారణం వడ్డీ రేట్లలో ఉన్న భారీ వ్యత్యాసం. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం.. ఒక పన్ను చెల్లింపుదారుడు తన అడ్వాన్స్ ట్యాక్స్ లేదా సెల్ఫ్-అసెస్మెంట్ ట్యాక్స్ కట్టడంలో జాప్యం చేస్తే సెక్షన్ 234A, 234B, 234C కింద నెలకు 1 శాతం చొప్పున అంటే ఏడాదికి 12 శాతం భారీ వడ్డీని జరిమానాగా కట్టాలి. కానీ, ఇదే ప్రభుత్వం రీఫండ్ ఇవ్వడంలో ఆలస్యం చేస్తే సెక్షన్ 244A కింద పన్ను చెల్లింపుదారుడికి ఇచ్చేది నెలకు కేవలం 0.5 శాతం అంటే ఏడాదికి కేవలం 6 శాతం వడ్డీ మాత్రమే. అంటే ప్రభుత్వం వసూలు చేసేటప్పుడు ఒక రేటు, ఇచ్చేటప్పుడు మరో రేటు ఉండటంపై పన్ను నిపుణులు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు.

నియమ నిబంధనల లోతుల్లోకి వెళ్తే పరిస్థితి మరింత దారుణంగా ఉంది. ప్రభుత్వం ఇచ్చే ఈ 6 శాతం స్వల్ప వడ్డీపై కూడా మళ్ళీ పన్ను కట్టాల్సి ఉంటుంది. మరోవైపు, మనం ప్రభుత్వానికి ఆలస్య రుసుముగా కట్టే 12 శాతం వడ్డీపై ఎలాంటి పన్ను మినహాయింపు లభించదు. ఈ ఏకపక్ష నిబంధనలు నిజాయితీగా పన్ను కట్టే పౌరులను నిరాశకు గురిచేస్తున్నాయి. అసలే ధరల పెరుగుదలతో సతమతమవుతున్న మధ్యతరగతి జీవికి, తన సొంత డబ్బు తిరిగి రావడానికి కూడా వడ్డీ నష్టం కలగడం అన్యాయమని అందరూ భావిస్తున్నారు.

రాబోయే బడ్జెట్ 2026లో కేంద్ర ఆర్థిక మంత్రి ఈ వివక్షకు స్వస్తి పలుకుతారని దేశవ్యాప్తంగా కోట్లాది మంది ఆశిస్తున్నారు. వడ్డీ రేట్లను రెండు వైపులా సమానంగా చేయాలని లేదా రీఫండ్ ఆలస్యానికి అదనపు నష్టపరిహారం చెల్లించాలని ట్యాక్స్ ఎక్స్‌పర్ట్స్ డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ బడ్జెట్‌లో వడ్డీ రేట్ల సమానత్వంపై ప్రకటన వస్తే, అది లక్షలాది మంది పౌరుల నమ్మకాన్ని పెంచడమే కాకుండా, వ్యవస్థపై గౌరవాన్ని పెంచుతుంది. ఈ ఫిబ్రవరి 1న సామాన్యుడి ఆశలు నెరవేరుతాయో లేదో వేచి చూడాలి.

Tags

Next Story