Budget 2026 : మారిన బడ్జెట్ లెక్కలు..సంక్షేమ పథకాల కోసం మరో రూ.2లక్షలు..కేంద్రం సంచలన నిర్ణయం.

Budget 2026 : ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ముగింపు దశకు చేరుకున్న తరుణంలో కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలకు మించి అదనపు నిధుల కోసం పార్లమెంటును ఆశ్రయించింది. మార్చి 31తో ముగియనున్న ఈ ఆర్థిక సంవత్సరంలో వివిధ సంక్షేమ పథకాలు, రక్షణ రంగ అవసరాల కోసం అదనంగా రూ.2.01 లక్షల కోట్లు ఖర్చు చేసేందుకు అనుమతి ఇవ్వాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో కోరారు. ఇందుకు సంబంధించి అనుబంధ పద్దుల రెండో విడతను ఆమె సభ ముందు ఉంచారు.
అదనపు నిధులు ఎక్కడ ఖర్చు చేస్తారు?
ప్రభుత్వం కోరిన ఈ భారీ మొత్తంలో సింహభాగం పేద ప్రజల ఆకలి తీర్చడానికి, రైతులకు అండగా ఉండటానికి కేటాయించనున్నారు. ముఖ్యంగా ప్రధాన మంత్రి గరీబ్ కల్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద ఉచిత రేషన్ పంపిణీకి అయ్యే సబ్సిడీ కోసం రూ.23,641 కోట్లు అవసరమని ప్రభుత్వం తెలిపింది. అలాగే, రైతులకు ఎరువుల కొరత లేకుండా సబ్సిడీ ధరకే అందించేందుకు ఎరువుల శాఖకు రూ.19,230 కోట్లు కేటాయించనున్నారు. దేశ రక్షణను మరింత బలోపేతం చేసే దిశగా రక్షణ మంత్రిత్వ శాఖకు అత్యధికంగా రూ.41,822 కోట్లు అదనపు నిధులు కోరారు.
ఖర్చు పెరిగినా లోటు ఉండదు..
నిజానికి ప్రభుత్వం అడిగిన మొత్తం అదనపు ఖర్చు రూ.2.81 లక్షల కోట్లు అయినప్పటికీ, వివిధ శాఖల ద్వారా వచ్చిన ఆదాయం, రికవరీల వల్ల నెట్ క్యాష్ ఖర్చు రూ.2.01 లక్షల కోట్లు మాత్రమే ఉంటుందని వివరించారు. దీనివల్ల ఆర్థిక లోటు పెరిగే అవకాశం లేదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక డిసెంబర్ 2025లో ప్రభుత్వం ఇప్పటికే రూ.41,455 కోట్ల అదనపు నిధులకు అనుమతి పొందింది. తాజా అంచనాల ప్రకారం, ప్రభుత్వం తన మొత్తం వార్షిక ఖర్చును రూ.50.65 లక్షల కోట్ల నుంచి రూ.49.65 లక్షల కోట్లకు తగ్గించుకుంది.
నిపుణుల విశ్లేషణ ఏంటి?
ప్రముఖ ఆర్థికవేత్త అదితి నాయర్ (ICRA చీఫ్ ఎకనామిస్ట్) అభిప్రాయం ప్రకారం.. ప్రభుత్వం అదనపు నిధులు కోరినప్పటికీ, ఇతర శాఖల్లో జరిగే పొదుపు వల్ల ఇది బ్యాలెన్స్ అవుతుంది. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉన్నందున, ఈ అదనపు గ్రాంట్లు అవసరమవుతాయి. జనవరి నాటికే ప్రభుత్వం రూ.36.90 లక్షల కోట్లు ఖర్చు చేసిందని కంట్రోలర్ జనరల్ ఆఫ్ అకౌంట్స్ డేటా చెబుతోంది. మొత్తం మీద, సామాన్యుడిపై భారం పడకుండా సంక్షేమ పథకాలు సజావుగా సాగడానికే ఈ నిధులు ఉపయోగపడతాయని విశ్లేషకులు చెబుతున్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
